ప్రాణాలమీదకు తెస్తున్న బట్టతల..

ఇటీవల హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సల నేపథ్యంలో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒకే క్లినిక్‌లో ఇద్దరు ఇంజనీర్లు చికిత్స అనంతరం ప్రాణాలు కోల్పోయిన కేసులు వెలుగుచూశాయి. ముఖ్యంగా సెప్టిసెమిక్ షాక్ (Septic Shock) అనేది తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల రక్తంలో బాక్టీరియా వ్యాప్తి చెందడం (సెప్టిసీమియా) వల్ల ప్రమాదం ఎదురవుతోంది.

ఇది శరీరంలో రక్తపోటు అతి తక్కువ స్థాయికి పడిపోవడం, అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం వంటి పరిస్థితులను కలిగిస్తుంది. త్వరగా చికిత్స అందించకపోతే, ఇది ప్రాణాంతకంగా మారవచ్చు. వైద్య పరంగా ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణించబడుతుంది. నాణ్యత లేని చికిత్స, అనుభవం లేని వైద్యుల వల్ల రోగులు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు గురవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ ఘటనలు యువతలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ పట్ల భయం కలిగించడమే కాకుండా, సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చకు దారితీశాయి. నేటి యువతలో ముందుగానే జుట్టు జారిపోవడం అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అసలు జుట్టును కాపాడుకోవాలంటే క్రమశిక్షణ, ఆహార నియమాలు, జీవనశైలిలో మార్పులు చేస్తే చాలనేది నిపుణుల అభిప్రాయం.

తగ్గడం ఊడిపోవడంను నివారించాలంటే పుష్కలంగా ఐరన్‌, ప్రొటీన్లు, బీ-కాంప్లెక్స్ విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఉల్లిపాయలు, గుడ్డు తెల్లసొన, ఆకుకూరలు, బాదం, పచ్చి కొబ్బరి, బీరకాయ, క్యారెట్, ఆవ, శనగలు వంటి పదార్థాలు జుట్టుకు పుష్కల పోషణ ఇస్తాయి. రోజు ఒక గ్లాసు పాలుతో పాటు అర టీస్పూన్ మేంతి పొడి తీసుకోవడం ద్వారా జుట్టు రాలటం తగ్గుతుంది.

వారంలో రెండు సార్లు కొబ్బరినూనె, ఆల్మండ్ నూనెతో మర్దన చెసుకోవడం మంచిది. అంతేకాదు నెయ్యి, నువ్వుల నూనె వంటివి సరైన మోతాదులో తీసుకోవడం కూడా ఉపయోగకరం. ఆహారంతో పాటు వ్యాయామం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. రక్తప్రసరణ మెరుగుపడేలా రోజూ కనీసం 30 నిమిషాల వాకింగ్ లేదా యోగా చేయడం వల్ల జుట్టు వృద్ధికి ఉపకరిస్తుంది. బ్రెయిన్, స్కాల్ప్‌కు రక్తసరఫరా బాగా జరిగితే హెయిర్ ఫాలికల్స్ బలపడతాయి.

జుట్టు సంరక్షణ విషయంలో కొన్ని చిన్న తప్పులు కూడా భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయి. ఉదాహరణకు రోజు రోజుకు షాంపూలు మార్చడం, ఎక్కువ వేడి నీటితో తలకడగడం, డ్రైయర్, స్ట్రెయిటెనర్‌లను తరచూ వాడటం తప్పు. అలాగే నిద్రలేమి, ధూమపానం, ఆల్కహాల్ వంటి అలవాట్లు కూడా జుట్టు నాశనానికి కారణమవుతాయి. వీటిని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. అంతిమంగా చెప్పాలంటే, బలమైన జుట్టు కోసం ఎలాంటి సర్జికల్ ప్రయోగాలకూ అవసరం లేదు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన నిద్ర, వ్యాయామం, మానసిక ప్రశాంతత ఇవే మంచి జుట్టు రహస్యం. కాసేపు శ్రమ పెట్టినా ఆరోగ్యంగా, సహజంగా ఉన్న జుట్టు ఎప్పుడూ శాశ్వతమే.