పహల్ గాం ఉగ్రవాద దాడికి ప్రతిగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు జరిపిన ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా తిరంగా ర్యాలీల పేరిట భారీ ప్రదర్శనలను చేపట్టింది. విజయవాడలో చేపట్టిన ఈ ర్యాలీకి సీఎం నారా చంద్రబాబు నాయుడితో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. నగరంలోని బందరు రోడ్డుపై నిర్వహించిన ఈ ర్యాలీలో కూటమి పార్టీల శ్రేణులతో పాటుగా పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు.
ఈ ర్యాలీలో తొలుత పవన్ కల్యాణ్ కనిపించలేదు. ర్యాలీ ప్రారంభం సందర్భంగా అలా కనిపించి వెనక్కు వెళ్లిపోయిన ఆయన కాసేపు ముందు వరుసలో కనిపించలేదు. దీంతో పవన్ స్థానంలో మంత్రి నాదెండ్ల మనోహర్, బాబు, పురందేశ్వరి లతో కలిసి నడిచారు. అయితే పవన్ ఎక్కడా అని అంతా ఎదురు చూస్తుండగానే… తిరిగి పవన్ ర్యాలీలో ముందు వరుస లోకి వచ్చారు. జాతీయ జెండా చేతబట్టుకుని మరీ ఆయన భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ బాబు పక్కన ప్రత్యక్షమయ్యారు. అనంతరం 2.5 కిలో మీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో పవన్ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
ఇదిలా ఉంటే… ర్యాలీని బెంజ్ సర్కిల్ వద్ద ముగించిన కూటమి సర్కారు… అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి జనాన్ని ఉద్దేశించి కీలక నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్… గతంలో మాదిరిగా ఉద్వేగంగా మాట్లాడలేకపోయారు. ప్రసంగిస్తున్నంత సేపూ ఆయన తరచూ దగ్గుతూనే కనిపించారు. జలుబు, దగ్గుతో ఆయన బాధ పడుతున్నట్లుగా ఆయన తీరును బట్టి చూస్తే ఇట్టే తెలిసిపోతోంది. ఈ సమస్యలతో బాధపడుతున్న పవన్.. తన ప్రసంగం మధ్యలో మంచి నీళ్లు తాగుతూ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సాగారు. తన ప్రసంగంలో తెలుగు వీర జవాన్ మురళి జవాన్ ఘనతను చాటి చెప్పిన పవన్.. భారత దేశ సైన్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని పిలుపు ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates