-->

పోలవరానికి ఇక బ్రేకులు లేవంతే!

పోలవరం ప్రాజెక్టు.. ఏపీకి జీవనాడి కిందే లెక్క. పోలవరం పూర్తి అయితే రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలకు లెక్కే లేదు. ఈ కారణంగానే కూటమి సర్కారు పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కూటమి సర్కారుకు మరింతగా ఊతం ఇచ్చేలా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు… ప్రత్యేకించి ప్రదాన మంత్రిత్వ కార్యాలయం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పోలవరానికి ఇకపై అడ్డంకులే రాకుండా ఉండేలా వ్యూహం రచించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే రంగంలోకి దిగుతున్నారు. ఈ పరిణామం పోలవరం ప్రాజెక్టుకు ఓ శుభ పరిణామం అని చెప్పక తప్పదు.

ఈ నెల 28న పోలవరం ప్రాజెక్టుపై ప్రదాని నరేంద్ర మోదీ స్వయంగా సమీక్ష జరపనున్నారు. ఈ సమీక్షకు ఏపీతో పాటుగా ఏపీ పొరుగు రాష్ట్రాలు, పోలవరం ప్రాజెక్టుతో ఎంతో కొంత ప్రభావితం అవుతున్న తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశాలు హాజరు కానున్నాయి. ఈ రాష్ట్రాల తరఫున ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఆయా రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, ఆ శాఖ కీలక అధికారులు, కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిటీల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఇక ఏ ఒక్క రాష్ట్రం నుంచి కూడా పోలవరం పట్ల అభ్యంతరాలు అన్నవే వ్యక్తం కావన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పోలవరం వల్ల ముంపు ఉంటుందని తొలుత తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయగా… ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందే.. తెలంగాణలోని ముంపు మండలాలను ఏపీలో కలిపేలా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యూహం రచించి అమలు చేశారు. అయినా కూడా కొంతమేర తెలంగాణ నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. ఇక ఒడిశా నుంచి కూడా పోలవరంపై చాలాకాలంగా అభ్యంతరాలున్నాయి. ఇటీవలే ఛత్తీస్ గఢ్ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈ సమస్యలు అన్నింటినీ సింగిల్ మీటింగ్ తో సెట్ చేసేలా మోదీ ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఏపీకి ఈ ప్రాజెక్టు ఏ మేర కీలకమన్న విషయాన్ని చెబుతూ చంద్రబాబు చేసిన ప్రతిపాదన మేరకే మోదీ… పొరుగు రాష్ట్రాల అభ్యంతరాల నివృత్తికి రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.

వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తానే ప్రాజెక్టును నిర్మించి ఏపీకి ఇవ్వాల్సి ఉంది. అయితే 2014 ఎన్నికల్లో సీఎంగా పదవి చేపట్టిన చంద్రబాబు… ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని, అందుకు కేంద్రం సహకరించాలని కోరారు. అందుకు నీతి ఆయోగ్ సరేననడంతో నిధులు కేంద్రం ఇచ్చేలా… నిర్మాణం రాష్ట్రం చేపట్టేలా ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 2019 దాకా ప్రాజెక్టు పనులు దాదాపుగా 72 శాతం మేర చంద్రబాబు పూర్తి చేశారు. అయితే 2019లో సీఎం అయిన జగన్ పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారు. తాజాగా 2024లో తిరిగి చంద్రబాబు సీఎం కాగా… 2027లోగా ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు దోహదం చేసేలా ఇప్పుడు మోదీ కూడా నేరుగా రంగంలోకి దిగిపోతున్నారు.