-->

మీ తెలివి ప్ర‌మాద‌క‌రం: ‘తెలంగాణ’ పై సుప్రీం ఫైర్‌

“మీ తెలివి ప్ర‌మాదక‌రం.. ఈ తెలివి తేట‌లు వేరే రాష్ట్రాలు కూడా అనుస‌రించే అవ‌కాశం ఉంది. వీటిని మొగ్గ‌లోనే తుంచేయాల్సిన అవ‌స‌రం ఉంది. వీటిని కొన‌సాగించినా.. ఉపేక్షించినా.. అవి స‌మాజానికి ప్ర‌మాద‌క‌ర సంకేతాలు ఇస్తాయి.” అని తెలంగాణ అధికారుల‌ పై(ప్ర‌భుత్వం పై నేరుగా కాదు) సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. చ‌ట్టానికి లోబ‌డి..నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌నులు చేయాల్సిన అధికారులు.. ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తే.. న్యాయ‌స్థానాలు చూస్తూ ఊరుకోబోవ‌ని తేల్చి చెప్పింది.

విష‌యం ఏంటంటే..

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ స‌మీపంలోని కంచ‌ గ‌చ్చెబౌలిలోని 4 వేల ఎక‌రాల భూముల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ క్ర‌మంలో వెయ్యి ఎక‌రాల్లో ఉన్న చెట్లు, పుట్ట‌లు, మొక్క‌లు తొల‌గించ‌డం.. వ‌న్య‌ప్రాణులు భ‌య భ్రాంతుల‌కు గుర‌య్యేలా ప్ర‌భుత్వ అధికారులు వ్య‌వ‌హ‌రించారంటూ.. ప‌లువ‌రు ప్ర‌కృతి ప్రేమికులు స‌హా.. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కోర్టును ఆశ్ర‌యించారు.

ఈ పిటిష‌న్‌పై ఇప్ప‌టికే ఒక‌సారి విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌హా.. సంబం ధిత అట‌వీ అధికారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిబంధ‌న‌లు పాటించారా? వాల్టా చ‌ట్టాన్ని (వాట‌ర్-లాండ్‌-ట్రీస్ చ‌ట్టం) అనుస‌రించారా? అని ప్ర‌శ్నించింది. అలా చేయ‌క‌పోతే.. జైలుకు వెళ్లాల‌ని గ‌త విచార‌ణ‌లోనే హెచ్చ‌రించింది. తాజాగా మ‌రోసారి.. ఈ పిటిష‌న్ బుధ‌వారం విచార‌ణ‌కు వ‌చ్చింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. మ‌రో కీల‌క విష‌యాన్ని ప్రస్తావించింది.

లాంగ్ వీకెండ్‌ను(సుదీర్ఘ వారాంత‌పు సెల‌వులు) చూసుకుని కంచ‌ గ‌చ్చెబౌలి భూముల్లో చెట్ల‌ను ఎలా న‌రికేస్తార‌ని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. “ఇది మ‌హా తెలివి. ఆ స‌మ‌యంలో ఎవ‌రూ ఉండ‌రు.. ఎలా చేసినా చెల్లుతుంద‌న్న‌ది స‌ద‌రు అధికారుల ప‌న్నాగం. దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నాం. ఈ తెలివి తేట‌లు ప్ర‌జ‌ల‌కు సేవలు అందించ‌డంలో చూపండి.” అని పైవిధంగా వ్యాఖ్యానించింది. దీనిపై త్వ‌ర‌లోనే ఆదేశాలు జారీ చేస్తామ‌ని.. తేడా వ‌స్తే.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(అప్ప‌టి శాంత కుమారి) జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.