టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు సంక్షేమంలో తనదైన మార్కు నిర్ణయాన్ని ప్రకటించారు. బుధవారం సాయంత్రం మంగళగిరి పరిధిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహానాడుతో పాటు కూటమి సర్కారు అమలు చేస్తున్న, అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సూపర్ సిక్స్ పేరిట కూటమి పార్టీలు రాష్ట్ర ప్రజలకు పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించిన కూటమి సర్కారు… దానిని ఇప్పటికే అమలులో పెట్టేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకాన్ని లబ్ధిదారులకు మరింత సౌకర్యంవంతంగా మారుస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి మూడు సిలిండర్ల డబ్బును ముందుగానే ఆయా లబ్ధిదారుల చేతికే అందించనున్నారు. ఆ సొమ్ముతో ఉచిత సిలిండర్లు తీసుకుంటారా? లేదంటే.. ఆ డబ్బును ఇతరత్రా అవసరాలకు వాడుకుని.. సిలిండర్లను డబ్బు పెట్టి కొంటారా? అన్నది లబ్ధిదారుల ఇష్టానికే వదిలేయాలని తేల్చింది.
ఇక వచ్చే నెలలో పాఠశాలలు తెరిచే లోగానే తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ములను లబ్ధిదారులకు అందజేస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ నిధులను పిల్లల తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. ఇక మరో కీలక పథకం అయిన అన్నదాతా సుఖీభవ పథకాన్ని కూడా వచ్చే నెలలోనే ప్రారంభించాలని బాబు తీర్మానించారు. కేంద్రం విడుదల చేసే నిధులతో కలిపి రాష్ట్ర వాటాలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు.
ఇక ఏటా నిర్వహించే పార్టీ పండుగ మహానాడుపై సుదీర్ఘ చర్చ జరిగింది. కడప నగర సమీపంలో సీకే దిన్నెలో ఈ ఏడాది మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 3 రోజుల పాటు వేడుకగా జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో చర్చించింది. అంతేకాకుండా ఆపరేషన్ సిందూర్ ను విజయవంతంగా చేపట్టిన భారత సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఆపరేషన్ సిందూర్ దిగ్విజయమైన తీరుపై ఈ నెల 15,16,17 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించింది. ఇక టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇటీవలే పద్మ భూషణ్ అవార్డు రాగా… ఆయనను పొలిట్ బ్యూరో ప్రత్యేకంగా అభినందించింది.