ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనల నిమిత్తం కొత్త హెలికాప్టర్‌ను కొనేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక, ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీసీఏ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్ పనితీరును అధ్యయనం చేయనుంది. అదేవిధంగా కొత్తగా కొనుగోలు చేయాలని భావిస్తున్న హెలికాప్టర్ విషయంపైనా సూచనలు, సలహాలు ఇవ్వనుంది. ఈ మేరకు సదరు ఉత్తర్వుల్లో కమిటీకి దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలనుంచి భారీఎత్తున కార్యక్రమాలు చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు కూడా వస్తున్నాయి. మరో వైపు పోలవరం వంటి కీలక ప్రాజెక్టులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు.. మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలకు, రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా జరిపే పర్యటనలు మరింత జోరుగా సాగనున్నాయి. ప్రస్తుతం హెలికాప్టర్ ఉన్నప్పటికీ.. దాని సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తదానిని కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిని సీఎంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.