టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించిన రాజు గారు.. ఆ తర్వాత వైసీపీ విధానాలు నచ్చక ఆ పార్టీకి ప్రత్యర్థిగా మారిపోయారు. జగన్ సర్కారు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను ఆయన బహిరంగంగానే ఎండగట్టారు. ఫలితంగా సిట్టింగ్ ఎంపీగా ఉండి అరెస్టయ్యారు. పోలీసుల అదుపులో లాఠీదెబ్బలూ తిన్నారు. ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గ పరిధిలో బుధవారం ప్రతీకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన మంగళవారం ఓ కీలక ప్రకటన చేశారు.
సరే.. మరి రాజుగారు ఏం చేసినా చాలా వెరైటీగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. రేపు తన నియోజకవర్గ పరిధిలో ప్రతీకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించిన రాజు గారు..నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా ఈ దినోత్సవంలో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తనకు వైసీపీ పాలనలో జరిగిన హింసపై నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నాటి ప్రభుత్వ దమననీతిపైనా, నాటి ప్రభుత్వ అడుగులకు మడుగులు ఒత్తుతూ సాగిన అధికారుల తీరుకు నిరసనగానే ఈ ప్రతీకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇక అసలు విషయంలోకి వెళితే… ఓ వ్యాపారవేత్తగా ఉన్న రఘురామ వైసీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో తనకు టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. ఏమైందో తెలియదు గానీ… 2019 ఎన్నికలకు చివరి నిమిషంలో బీజేపీని వీడిన ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరారు. నరసాపురం ఎంపీ టికెట్ సంపాదించారు. ఎంపీగా గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. వైసీపీలో ఉన్నా… బీజేపీలో కీలక నేతలు ప్రదాని నరేంద్ర మోదీ సహా చాలా మంది నేతలతో ఆయన సన్నిహిత సంబంధాలు నెరపారు. తెలుగు బాషపై జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి రాజు గారు… ఆ పార్టీకి దూరమైపోయారు.
ఈ క్రమంలో జగన్, వైసీపీ మాజీ ఎంపీ సాయిరెడ్డిలపై వరుసగా విమర్శలు చేసిన రాజుగారిపై 2021 మే 14న ఏపీ పోలీసులు ఏకంగా రాజద్రోహం కేసు పెట్టారు. నరసాపురంలో ఆయన అడుగే పెట్టకుండా చేశారు. చివరకు హైదరాబాద్ కూ రాకుండా ఆయనను తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. ఈ క్రమంలో తన ఇంటిలో ఓ శుభకార్యం నిమిత్తం హైదరాబాద్ రాగా… రాజు గారిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజు సీఐడీ అదికారులు తమ కస్టడీలో రాజు గారిపై తమ ప్రతాపం చూపారు. ఈ గాయాలను పంటి బిగువున భరించిన రాజు గారు..ఆ మరునాడు తనకు అయిన గాయాలను మీడియాతో పాటు న్యాయమూర్తికి చూపించి జగన్ అండ్ కోను అడ్డంగా బుక్ చేశారు. ఈ క్రమంలో బుధవారం జరిగే ప్రతీకార దినోత్సవంలో రాజు గారు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates