ప్రపంచానికే పాఠాలు నేర్పుతున్నారంటూ.. బీజేపీ నేతలు ఆకాశానికి ఎత్తేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మెతకబడ్డారా? ఆయన వ్యూహానికి.. ఆయన దూకుడుకు ప్రజలు అడ్డుకట్ట వేస్తున్నారా? అంటే.. రెండు కీలక పరిణామాలను గమనిస్తే.. ఔననే పరిస్థితే కనిపిస్తోంది. ఒకటి మన దేశానికి సంబంధం లేని అమెరికా ఎన్నికలు! రెండు మన దగ్గరే జరుగుతున్న బీహార్ ఎన్నికలు. ముందు అమెరికా గురించి మాట్లాడుకుంటే.. అక్కడ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారతీయ అమెరికన్ల ఓట్లను గుండుగుత్తుగా తన వైపు తిప్పుకొనేందుకు మోడీ ఇమేజ్‌ను వాడుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ భారత్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా మోడీని ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తామని చెప్పుకొచ్చారు. మోడీ తనకు ఆప్తమిత్రుడని, దూరదృష్టి ఉన్న పాలకుడని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదే అంశాన్నిఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాగా వినియోగించారు. భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక వీడియోలను కూడా ప్రదర్శించి.. మోడీ సింపతీని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. కానీ, వ్యూహం బెడిసి కొట్టింది. ట్రంప్ ఆశించిన ఫలితం దక్కలేదు. మోడీని చూసి తనకు ఓట్లేస్తారని అనుకున్నా.. భారతీయ అమెరికన్లు బైడెన్ వైపు మొగ్గు చూపించారు. అంటే.. ఇక్కడ మోడీ ఓడారా? అనే సందేహాలు తెరమీదికి వచ్చాయి.
ఇక, బిహార్ విషయానికి వద్దాం. మేం తీసుకువచ్చిన అనేక పథకాలు బీహార్ ప్రజల మనసులు దోచాయి. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఎన్నికల్లో మాదే విజయం. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. ఈ సారి ఎన్నికల కమిషన్.. మరో వారం రోజుల ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. ఎందుకంటే.. భారీ ఎత్తున పోలింగ్ జరుగుతుంది కాబట్టి!
– ఇది స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎన్నికల ప్రసంగాల్లో దంచికొట్టిన విధానం. కానీ, రెండు దశల ఎన్నికలు ముగిసినా.. 54 శాతం ఓటింగ్ కూడా దాటలేదు. ఇది గతానికన్నా పిసరంత తక్కువేనని విశ్లేషణలు వచ్చాయి.
ఇక, నిన్న మొన్నటి వరకు నరేంద్ర మోడీ కార్డును వినియోగించుకున్న సీఎం నితీష్ కుమార్.. తాను ప్రవేశ పెట్టిన పథకాలు లేవనుకున్నారో.. తన పాలనతో ప్రజలు విరక్తి చెందారని భావించారో.. ప్రతి ఎన్నికల సభలోనూ మోడీని హైలెట్ చేశారు. మోడీ పాలనతోను, పథకాలతోనూ రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తోందని ప్రసంగిస్తూ.. వచ్చారు. కానీ, మూడో దశ ఎన్నికల ప్రచారానికి వచ్చే సరికి ఆయన మోడీ ట్యాగ్‌ను వదిలేశారు. బహుశ రెండు దశల ఎన్నికల్లో మోడీ హవా ఎక్కడా కనిపించకపోవడే కారణం కావొచ్చు.. ఇప్పుడు నితీష్ సంచలనాత్మక అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చారు. ఇదే తనకు చివరి ఎన్నికలని(నిజానికి నితీష్ ఎక్కడా పోటీ చేయలేదు.) తనను ఆశీర్వదించాలని సెంటిమెంట్ ప్లే చేస్తున్నారు. వాస్తవానికి ఈ మాట రెండు దశ పోలింగ్ ప్రచారంలో ఎక్కడా వినిపించలేదు. మూడో దశకు వచ్చేసరికి మోడీ పేరు పక్కన పెట్టి.. ఈ వ్యాఖ్యలను తెరమీదికి తీసుకురావడం వెనుక.. మోడీ హవా ఇక, పనిచేయదని అనుకున్నారో.. ఏమో..! దీంతో అమెరికా ఎన్నికల్లో కనిపించని మోడీ హవా.. బిహార్‌లోనూ అంతేనా? అనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.