వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు ఇప్పుడప్పుకే జైలు జీవితం ముగియదని చెప్పక తప్పదు. ఎందుకంటే… వంశీ సింగిల్ కేసులోనే అరెస్టు అయినా… ఆ తర్వాత ఆయనపై వరుసగా కేసులు నమోదు అయిపోయాయి. ఫలితంగా ఓ కేసులో బెయిల్ వస్తే… ఇంకో కేసులో ఆయనకు రిమాండ్ తగులుతోంది. వెరసి బెయిల్ వచ్చినా వంశీ జైలు వెలుపలికి వచ్చే ఛాన్స్ ఇప్పుడప్పుడే దక్కేలా లేదని చెప్పాలి. దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో బెజవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వంశీకి బెయిల్ మంజూరు చేసినా… ఆయన బయటకు వచ్చే ఛాన్స్ లేదు.
వాస్తవానికి టీడీపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించిన వంశీ… 2019 ఎన్నికల తర్వాత పలు నాటకీయ పరిణామాలతో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. నాడు అదికారంలో ఉన్న వైసీపీలో చేరడం ద్వారా వంశీకి ఏమాత్రం ప్రయోజనం దక్కిందో తెలియదు గానీ..ఆయనకు చుట్టూ శత్రువులే తయారయ్యారు. గన్నవరంలో మంచి పట్టు కలిగిన వంశీ..నెలల వ్యవధిలో ఆ పట్టు సడలింది. ఈ నష్టం ఎంతగా అంటే…2024 ఎన్నికల్లో నూతన నేత చేతిలో పరాజయం పాలయ్యేంతగా ఆ నష్టం జరిగింది. ఇక అధికార పార్టీ అండ చూసుకుని వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా రెచ్చిపోయారు. నేరుగా చంద్రబాబు, లోకేశ్ లనే టార్గెట్ చేశారు. చివరకు తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ కార్యాలయాన్నే ఆయన ధ్వంసం చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి కేసు వెనక్కు తీసుకునేలా వంశీ వ్యూహం రచించారు. అయితే ఈ వ్యూహం బెడిసి ఆయన నేరుగా కూటమి సర్కారుకు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసిన బెజవాడ పోలీసులు.. ఆ తర్వాత టీడీపీ కార్యాలయంపై ఉన్న కేసులోనూ అరెస్టు చేస్తున్నట్లు చూపించారు. ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామంలో భూకబ్జాకు పాల్పడ్డారన్న ఆరోపణలపైనా వంశీపై కేసు నమోదు అయ్యింది. ఇలా వరుసగా వంశీపై కేసులు నమోదు అయ్యాయి.
తాజాగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో వంశీతో పాటు ఆయన నలుగురు అనుచరులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇదివరకే విచారణ చేపట్టిన కోర్టు.. మంగళవారం సాయంత్రం వంశీ సహా ఆయన నలుగురు అనుచరులకు కూడా బెయిల్ మంజూరు చేసింది. అయినా కూడా టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, భూకబ్జా కేసులు కూడా వంశీపై నమోదు అయి ఉండటంతో ఆ కేసుల్లోనూ బెయిల్ వస్తే తప్పించి వంశీ బయటకు వచ్చే అవకాశాలు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ కేసులన్నింటిలో బెయిల్ ఎప్పుడు వస్తుందో, వంశీ ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి.