బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు. ఎన్నికల పోలింగ్ కు ముందు.. ఆ రోజు కూడా కంటిపై కునుకులేదు. మూడు సార్లుగా అప్రతిహతంగా విజయం దక్కించుకుంటున్న రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ జల్ల కొడుతుందో అన్న భయం వెంటాడింది. ఇక, ఎన్నికలు ముగిశాయి. మరి ఆరోజైనా నిద్ర ఉందా? అంటే.. ఫలితం వచ్చే వరకు కూడా ఉండకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు.
రీజనేంటి?
ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. ఎన్నికల ప్రక్రియపై ఆమె అనేక సందేహాలు వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ.. కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్ అనంతరం.. తాను పోటీ చేస్తున్న భవానీ పూర్‌లో ఈవీఎంలను తారు మారు చేసే అవకాశం ఉందని భావిస్తున్న ఆమె.. అక్కడే తిష్ట వేశారు. ఇంత చేసినా ఎక్కడో భయం.. శంక రెండూ ఆమెను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలక అంశంతో తెరమీదకు వచ్చారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడించే సోమవారంనాడు.. పరిశీలకులుగా.. ఓట్లు లెక్కించే వారుగా ఎన్నికల సంఘం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తున్నట్టు ఇచ్చిన ఉత్తర్వులపై యుద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. వీరంతా కేంద్రానికి అనుకూలంగా పనిచేస్తారని.. ఫలితాన్ని తారుమారు చేసినా ఆశ్చర్యం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో న్యాయ పోరాటానికి కూడా దిగారు. కానీ కోర్టులో కూడా నిరాశే మిగిలింది.
మరోవైపు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ఆమె.. గత రాత్రి అక్కడే నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ఆమె ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం.. ఓట్ల లెక్కింపులో రాష్ట్ర సిబ్బందిని పరిగణనలోకి తీసుకోవాలన్నది మమత విజ్ఞాపన. కానీ, ఇది తమ విచక్షణ, స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో మమతకు నిద్ర కరువైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న బెంగతో ఆమె కంటిపై కునుకు కరువైందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates