ఆపరేషన్ కెల్లార్!… నాయక్ మృతికి రివెంజ్ దెబ్బ!

పహల్ గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 100 మంది కరడుగట్టిన తీవ్రవాదులతో పాటుగా పదుల సంఖ్యలో పాక్ సైనికులు కూడా చనిపోయారు. ఈ విషయాన్ని పాక్ కూడా దాదాపుగా ధృవీకరించింది. అయితే పాక్ ప్రోత్సాహంతో ఉగ్ర మూకలు భారత సైన్యంపై దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ దాడుల్లో ఏపీకి చెందిన వీర జవాన్ మురళి నాయక్ అసువులు బాశారు. పోషియాన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు తాజాగా భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని చెప్పాలి.

పోషియాన్ పరిధిలోని కెల్లార్ లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భారత సైన్యం ఆపరేషన్ కెల్లార్ పేరిట మంగళవారం ఓ ప్రత్యేక ఆపరేషన్ ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లో బారత సైన్యాన్ని చూసినంతనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారీ ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతూనే సాగిన భారత సైనికులు అక్కడ సంచరిస్తున్న ఉగ్రవాదుల్లో ముగ్గురిని మట్టుబెట్టారు. చనిపోయిన వీరంతా కూడా కరడుగట్టిన ఉగ్రవాదులేనని తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వెరసి మరింత మంది ఉగ్రవాదులు కెల్లార్ ప్రాంతంలో దాక్కున్నట్లుగా సమాచారం.

పోషియాన్ అనేది జమ్ము కశ్మీర్ లోని అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి చెప్పుకోవాలి. ఇక్కడ పనిచేసే బారత సైనికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేస్తూ సాగుతుంటారు. ఎందుకంటే…నిత్యం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడ విరుచుకుపడుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఇటివలే జరిగిన దాడుల్లో మురళి నాయక్ మృత్యువాత పడ్డారు. ఈ మృతిని తీవ్రంగా పరిగణించిన భారత సైన్యం ఆ ప్రాంతంలోని ఉగ్రవాద కదలికలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇప్పుడు ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా…మరికొందరు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.