=

కూటమి సర్కారును మెచ్చుకున్న జగన్!

సమయం ఏదైనా, సందర్భం ఏదైనా రెండు ప్రత్యర్థి రాజకీయ పార్టీల మధ్య ప్రోత్సాహకర, పొగడ్తలతో కూడిన వ్యాఖ్యలు వినిపించవు. ఇక ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూస్తే… కూటమి పార్టీలు, వైసీపీల మధ్య ఈ తరహా సుహృద్భావ వాతావరణం కనిపించే ప్రసక్తే లేదు. ఎందుకంటే… కూటమి సర్కారు సారధి చంద్రబాబుతో పాటు ఉప సారథి పవన్ కల్యాణ్ లంటే… జగన్ కు అసలే గిట్టడం లేదు. వారి ప్రస్తావన వస్తేనే ఆయన ఓ రేంజిలో ఫైరవుతున్నారు. ఇక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్న నెపంతో జగన్ పైనా వారిద్దరితో పాటు కూటమి పార్టీలు విరుచుకుపడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్ నోట కూటమి సర్కారు పొగడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. ఇందుకు శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాలోని అమర జవాన్ మురళి నాయక్ ఇల్లు వేదికగా నిలిచింది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఇటీవలే పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మురళి నాయక్ వీర మరణం చెందిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం జరిగిన నాయక్ అంతిమ యాత్రకు పవన్, నారా లోకేశ్ లతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. లోకేశ్ స్వయంగా నాయక్ పార్థీవ దేహాన్ని మోసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. బాదిత కుటుంబానికి 5 ఎకాల పొలం, నాయక్ తండ్రికి సర్కారీ కొలువు కూడా ప్రకటించారు.

తాజాగా మంగళవారం మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ కల్లి తండాకు వచ్చారు. ఈ సందర్భంగా నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన జగన్… వారి కుటుంబానికి వైసీపీ అండగా నిలుస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా నాయక్ కుటుంబానికి వైసీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అనంతరం నాయక్ ఇంటి ముందే మీడియాతో మాట్లాడిన జగన్… యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని తాము అదికారంలో ఉండగా నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఇప్పుడు కూటమి సర్కారు నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ఇచ్చిందన్న జగన్.. కూటమి సర్కారుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాని పేర్కొన్నారు.

జగన్ నోట కూటమి సర్కారును మెచ్చుకుంటూ వెలువడ్డ ఈ మాట అక్కడున్న వారితో పాటుగా జగన్ ప్రసంగాన్నిలైవ్ గా టీవీల్లో వీక్షిస్తున్న ఏపీ జనం కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కూటమి పార్టీలు అన్నా… సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అన్నా నిత్యం ఘాటు వ్యాఖ్యలు చేసే జగన్…. నాయక్ కుటుంబానికి చేసిన సర్కారీ సాయాన్ని గుర్తు చేసుకుని మరీ కూటమి సర్కారును మెచ్చుకోవడం నిజంగానే గమనార్హం. అయితే ఈ అంశానికి కూడా తన పార్టీ ప్రభుత్వానికి ముడిపెట్టి మరీ జగన్.. కూటమి సర్కారును మెచ్చుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏదైతేనేం.. కూటమిని జగన్ మెచ్చుకున్నారు కదా… అదే చాలు అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.