ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్న మద్యం కుంభకోణం కేసులో మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్టు చేశారు. కర్ణాటక లోని మైపూర్ లో తలదాచుకున్న గోవిందప్ప గురించిన పక్కా సమాచారాన్ని సేకరించిన సిట్ అధికారులు సోమవారం రాత్రి అక్కడకు చేరుకుని… గోవిందప్పను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను మైసూరు నుంచి విజయవాడ తరలిస్తున్నట్లుగా సమాచారం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న భారతి సిమెంట్స్ లో బాలాజీ గోవిందప్ప శాశ్వతకాల డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆర్థికపరమైన వ్యవహారాలపై మంచి పట్టు ఉన్న గోవిందప్ప చాలాకాలంగా జగన్ ఫ్యామిలీతో కలిసి సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు భారతి సిమెంట్స్ బోర్డులో శాశ్వత కాల డైరెక్టర్ పదవి దక్కినట్లుగా చెబుతున్నారు. జగన్, భారతిలు అందుబాటులో లేకున్నా కూడా భారతి సిమెంట్స్ వ్యవహారాలన్నీ కూడా గోవిందప్ప కనుసన్నల్లోనే జరుగుతుంటాయి.
మద్యం కుంభకోణంలో ఆయా డిస్టిల్లరీస్ నుంచి వసూలైన ముడుపులను నాడు జగన్ వద్ద కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలతో పాటు గోవిందప్పలు షెల్ కంపెనీల ద్వారా జగన్ వద్దకు చేరే దిశగా కీలకంగా వ్యవహరించారని ఇప్పటికే సిట్ గుర్తించింది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలంటూ ఇటీవలే ఈ ముగ్గురికి సిట్ అదికారులు నోటీసులు జారీ చేయగా…ముగ్గురు కూడా విచారణకు డుమ్మా కొట్టి పరారీలో ఉన్నారు. దీంతో వారి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన సిట్.. తాజాగా గోవిందప్పను పట్టేసింది.
వాస్తవానికి గోవిందప్పకు పెద్దగా రాజకీయ సంబంధాలేమీ లేవనే చెప్పాలి. జగన్ ఫ్యామిలీ ఆర్థిక పరమైన వ్యవహారాలను మాత్రమే చూసే ఈయన… మద్యం కుంభకోణంలో వసూలైన నిధులను మాత్రం జగన్ కు చేరవేయడంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ముడుపుల వసూళ్లలో పాత్రేమీ లేకున్నా…వసూలైప నిధులను గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడకు చేర్చాలో అక్కడకు చేర్చే పని మాత్రం ఈయనదేనట. ఈ లెక్కన మద్యం ముడుపుల అంతిమ లక్ష్యం ఏమిటన్న విషయం గోవిందప్పను విచారిస్తే తేలిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates