పాకిస్థాన్ తన దమన నీతిని మరోసారి రుజువు చేసుకుంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో భారత ఆర్మీ ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌తో పాకిస్థాన్ ఆర్మీ ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ ఫోన్ చేసి సుమారు గంటపాటు చర్చించారు. ఇకపై.. తాము సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కి తిరిగి రప్పిస్తామని.. మీరు కూడా అలానే చేయాలని పాక్ అధికారి కోరారు. దీనికి భారత్ అంగీకరించింది. అదేవిదంగా మేం మిస్సైళ్లను, డ్రోన్లను ఎట్టి పరిస్థితిలోనూ ప్రయోగించబోమని.. దయచేసి మీరు కూడా మీ మీ వ్యవస్థలను వెనక్కి పిలవాలని పాక్ అధికారి ప్రాధేయ పడ్డారు.
దీనికి కూడా భారత్ అంగీకరించింది. ఆ తర్వాత.. గంటన్నర వ్యవధిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని.. దీనిని అంతం చేసే వరకు ఆ దేశానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అయితే.. ఆయన ప్రసంగం ముగిసిన(8.22 నిమిషాలకు) గంట సేపటిలోనే పాకిస్థాన్ తన దుష్టబుద్ధిని ప్రదర్శించింది. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. సాంబ, ఆర్నియా సెక్టార్లలో కాల్పులు, డ్రోన్ల దాడితో మరోసారి భీతావహ వాతావరణం ఏర్పడింది. దీంతో ప్రజలు భీతిల్లినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
దీంతో హోషియార్‌పూర్‌లో సైరన్లు మోగించారు. దీంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. సాంబా, ఆర్నియాలో డ్రోన్ కదలికలను గుర్తించిన భారత సైన్యం.. అంతే దీటుగా వాటిని ధ్వంసం చేసింది. భారత్ ప్రయోగించిన డ్రోన్లు .. పాక్ డ్రోన్లను తక్షణం నేల కూల్చాయని అధికారులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. కాగా.. పాక్ మరోసారి దుస్సాహసానికి దారితీయడంతో పంజాబ్, రాజస్థాన్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో బ్లాకౌట్ చేశారు. అంటే.. అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
కాగా.. పాక్ మరోసారి కాల్పులకు, డ్రోన్ దాడులకు దిగడం పట్ల.. అధికారులు సోమవారం అర్ధరాత్రి మరోసారి చర్చించారు. ఎలాంటి పరిస్థితినైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సరిహద్దుల వెంబడి సైన్యాన్ని వెనక్కి రప్పించరాదని.. పరిస్థితులు చక్కబడే వరకు ప్రస్తుతం ఉన్న సైన్యాన్ని అలానే కొనసాగించాలని నిర్ణయించా రు. ఇదిలావుంటే.. మంగళవారం అమెరికాతో భారత్ చర్చలు జరపనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.