అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోటి దురదకు భారత ప్రభుత్వం కూడా అలానే దూకుడుగా సమాధానం ఇచ్చింది. కీలక మైన పాకిస్థాన్-భారత్ ఉద్రిక్తతల విషయంలో జోక్యం చేసుకున్న ట్రంప్.. శనివారం.. సాయంత్రం 5 గంటల సమయంలో నేను ఇరువురితోనూ మాట్లాను. వెంటనే కాల్పుల విరమించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాలు చాలా గొప్ప దేశాలు.. ఇద్దరు పాలకులు చాలా పరిణితి చెందిన వారు. గొప్ప వ్యక్తులు. అని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే అనేక సందేహాలు వచ్చాయి. అసలు ఇంత హఠాత్తుగా భారత్ కాల్పుల విరమణకు దిగడం ఏంటన్నది పెద్ద సందేహం. అయితే.. భారత్ ట్రంప్ ప్రకటనతో సంబంధం లేకుండా.. ఇరు దేశాల డైరెక్టర్ జనలర్ ఆఫ్ ఆర్మీలు మాట్లాడుకున్నా రని.. పాక్ తొలుత ఫొన్ చేయడంతో మనం కూడా స్పందించామని భారత్ పేర్కొంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ ప్రకటించామని.. ఇది ఒప్పందం కాదు.. అవగాహన మాత్రమేనని స్పష్టం చేసింది. అంతేకాదు.. అసలు ఇతరులకు ఈ అవగాహనకు సంబంధం లేదని కూడా భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది.
కట్ చేస్తే..
సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో అనూహ్యంగా మరోసారి ట్రంప్ వైట్ హౌస్ వేదికగా.. మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమన్నట్టుగా మాట్లాడారు. అంతేకాదు.. అణుయుద్ధాన్ని(నిజానికి అటు పాక్ నుంచి హెచ్చరికలు మాత్రమే వచ్చాయి. భారత్ అది కూడా చేయలేదు.) జరగకుండా ఆపానని తెలిపారు. తాను జోక్యం చేసుకు న్నందుకే.. అణుయుద్ధం, వినాశనకరమైన యుద్ధం ఆగిపోయిందన్నారు.
మళ్లీ కొద్ది సేపటికి.. ట్రంప్ మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో మరింత దూకుడుగా మాట్లాడారు. “మీరు యుద్ధం ఆపకపోతే(వాస్తవానికి యుద్ధం అని భారత్ ఎక్కడా చెప్పలేదు. కేవలం ఉగ్ర శిబిరాల ధ్వంసం మాత్రమేనని చెప్పింది.) మీతో వాణిజ్యం చేసుకునేది లేదన్నారు. తక్షణమే వాణిజ్యాన్ని ఆపేస్తామని హెచ్చరించడం వల్లే భారత్ .. పాక్..లు దిగివచ్చాయన్న అర్థంలో తన తెంపరి తనాన్ని ప్రదర్శించారు ట్రంప్.
భారత్ దీటైన జవాబు!
ఉద్రిక్తతలకు తెరదించని పక్షంలో వాణిజ్యం నిలిపేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలను భారత్ చెత్తబుట్టలో పడేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతున్న సమయంలో రెండు మూడు సందర్భాల్లో అమెరికా ప్రతినిధులతో ఫోన్‌లో చర్చలు జరిగాయని తెలిపింది. కానీ, ఎక్కడా వాణిజ్యం అన్న మాటే ఎత్తలేదని స్పష్టం చేసింది. లేనిదానిని ట్రంప్ కల్పించుకుని వ్యాఖ్యానిస్తున్నారని తెలిపింది. ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్, భారత భద్రతా సలహాదారు అజిత్ డొభాల్ తదితరులు.. అమెరికా అగ్రనాయకులు, అధికారులతో మాట్లాడారని.. కానీ, ఎక్కడా వాణిజ్యం గురించి చర్చ జరగలేదని తెలిపింది. కాల్పుల విరమణకు, వాణిజ్యానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో తెంపరి ట్రంప్‌కు భారత్ గట్టి షాకే ఇచ్చినట్టు అయింది.