చివరి ఎన్నికల పేరుతో సెంటిమెంటును ప్రయోగించిన నితీష్

పదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశానని చెప్పుకున్నా చివరకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సెంటిమెంటునే నమ్ముకున్నట్లున్నారు. బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో మూడో విడత ప్రచారంలో పూర్ణియా జిల్లాలో మాట్లాడుతూ ‘2020 ఎన్నికలే తన జీవితంలో చివరి ఎన్నికలం’టూ ప్రకటించేశారు. ఈ నెల 7వ తేదీన మూడో దశ పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలతో నితీష్ బిజీగా ఉన్నారు. ఎన్డీయే తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా జేడీయు అధ్యక్షుడు నితీష్ కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బీహార్ అసెంబ్లీలోని 243 సీట్లకు మూడు దశల్లో పోలింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి దశలో పోలింగ్ జరిగిన 71 స్ధానాల్లో ఎన్డీయే వెనకబడిందని ఎగ్జిట్ పోల్ సర్వేలో బయటపడింది. మొన్నటి 3వ తేదీన 97 స్ధానాలకు జరిగిన రెండో దశ పోలింగ్ లో కూడా ఎన్డీయేకి పరిస్దితులు ఏమంత ఆశాజనకంగా లేదని సమాచారం. అందుకనే మూడో దశలో జరగబోయే పోలింగులో పుంజుకోకపోతే ఎన్డీయే కూటమిగా జేడీయు అధికారంపై ఆశలు వదులుకోవాల్సిందే.

అంటే పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని తాను ఎంతో అభివృద్ది చేశానని చెప్పుకోవటం, కేంద్రంలో నరేంద్రమోడి ప్రభుత్వం కూడా పెద్దగా ఆదుకుంటున్నట్లు కనబడలేదు. అభివృద్దిని, మోడిని నమ్ముకునే కంటే సెంటిమెంటును నమ్ముకుంటేనే వర్కవుట్ అవుతుందని అనుకున్నట్లున్నారు. అందుకనే పూర్ణియా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తనకు ఇవే చివరి ఎన్నికలంటూ పెద్ద అస్త్రాన్ని వదిలారు. ‘బీహార్ ఎన్నికలకు ఇదే చివరి రోజు..నా రాజకీయ జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు..ఇవే నా చివరి ఎన్నికలు..రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంటు పలుకుతున్నా’ అంటూ బహిరంగసభలో ప్రకటించారు.

మొత్తానికి సెంటిమెంటు మాత్రమే తనను గట్టెక్కిస్తుందని నితీష్ డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే జనాలపైకి సెంటిమెంటు అస్త్రాన్నిసంధించారు. మరి ఈ అస్త్రం ఫలితమిస్తుందా లేదా అన్నది 7వ తేదీన కానీ తెలీదు. ఎందుకంటే ఆరోజే పోలింగ్ జరగబోతోంది. 10వ తేదీన ఫలితాలు వచ్చేస్తాయి. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే చిన్న ట్విస్టు పెట్టినట్లున్నారు నితీష్. ఎందుకంటే గడచిన 30 ఏళ్ళల్లో ఎన్నడు అసెంబ్లీకి పోటి చేసింది లేదు. ఎంఎల్సీ సభ్యునిగానే అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు.

అలాగే తన రాజకీయ జీవితంలో ఇదే చివరి ఎన్నికల్లన్నారే కానీ రాజకీయాల నుండి విరమించుకుంటున్నట్లు స్పష్టంగా ప్రకటించలేదు. రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతోనే రిటైర్మెంటు పలుకుతున్నట్లు చెప్పారంతే. అంటే బహుశా భవిష్యత్తులో రాజ్యసభ ఎంపిగా కేంద్రానికి వెళిపోతారేమో చెప్పలేం. ఎందుకంటే నితీష్ వయస్సు 70 ఏళ్ళే. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు చెప్పలేం కదా.