జమ్ము కశ్మీర్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో గత నెల 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది(ఒకరు నేపాలీ) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మతం పేరు అడిగి మరీ ఉగ్రవాదులు వీరిని హతమార్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్‌లోని ఉగ్రమూకల శిబిరాలపై బెబ్బులిలా విరుచుకుపడింది. ఉగ్రతండాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను పదుల సంఖ్యలో హత మార్చింది. ఈ ఘటన తర్వాత.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. ప్రస్తుతం కాల్పుల విరమణ అవగాహన కొనసాగుతోంది.
దీనిని పురస్కరించుకుని ప్రధాన మంత్రిన రేంద్రమోదీ సోమవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు. మొత్తం 22 నిమిషాల 18 సెకన్లపాటు ఆయన ప్రసంగించారు. మొత్తం ప్రసంగంలో మూడు కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా పాకిస్థాన్‌ను మూడు విషయాల్లో గట్టిగా హెచ్చరించారు. 1) ఉగ్రవాదం-చర్చలు. 2) ఉగ్రవాదం-వాణిజ్యం. 3) ఉగ్రవాదం-జల సహకారం. ఈ మూడు విషయాలపైనా దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించి.. తగిన విధంగా వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రమూకల శిబిరాలను అంతం చేసేందుకు పాక్ స్వయంగా ముందుకు రావాలని తేల్చి చెప్పారు.
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాక్.. అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించిందన్నారు. ఈ శిబిరాలను తొలగించడంతోపాటు.. ఉగ్రవాదులను తుదిముట్టించే వరకు.. చర్చలు అనే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. ఇక, రెండో విషయానికి వస్తే.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. ఉగ్రమూకలకు దన్నుగా ఉన్న పాక్‌తో వాణిజ్య సంబంధాలు కూడా కొనసాగబోవమన్నారు. ఈ విషయంలో ఎలాంటిప రిస్థితి ఎదురైనా బేఖాతరు చేయనున్నట్టు తెలిపారు. ఇక, మూడో విషయం.. ఉగ్రవాదం కొనసాగుతున్నన్నాళ్లూ.. జల సంబంధమైన ఒప్పందాలు కొనసాగబోవమని బల్ల గుద్ది చెప్పారు.
వాస్తవానికి ఈ మూడు విషయాలు.. పాకిస్థాన్‌కు అత్యంత కీలకం. భారత్‌తో తలపడే శక్తి లేదు. అంత సత్తువ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే చర్చల ద్వారా కాల్పుల విరమణకు తానే ముందుకు వచ్చింది. ఇక, వాణిజ్య సహకారంలో భారత్ నుంచి పాక్ కు 42 శాతం వాటా ఉంది. ఇప్పుడు దానిని ఆపేస్తే.. పాక్ వాణిజ్య వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇక, జలాల విషయంలో ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. దీనిని పునరుద్ధరించకపోతే.. పాక్‌లోని మూడొంతుల భూభాగానికి నీరు అందే పరిస్థితి లేదు. తద్వారా.. వ్యవసాయం ధ్వంసం అవుతుంది. అందుకే.. ఈ మూడు విషయాలను ముడిపెట్టి.. ఉగ్రవాదంపై పాక్‌కు మోడీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.