ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ అంటే.. కేవలం ఆపరేషన్ కాదని.. దేశంలోని కోట్లాది మంది మహిళల సిందూరానికి ప్రతీకగా పేర్కొన్నారు. తొలుత ఆయన శౌర్య పరాక్రమాలను ప్రదర్శించిన భారత సైన్యానికి, సశస్త్ర సీమా బల్‌కు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదన్నారు.
ఆపరేషన్ సిందూర్.. అనేది కేవలం మాట కాదని.. ఇది కోట్లాది మంది మహిళలకు చిహ్నమని పేర్కొన్నారు. పహల్గాంలో అమా యకులను పొట్టున పెట్టుకున్నారని చెప్పారు. అమాయక పౌరులను పాకిస్థాన్ పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం పేరు అడిగి మరీ ప్రాణాలు తీశారని.. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదన్నారు. కుటుంబ సభ్యుల ముందే.. అయి న వారిని పొట్టన పెట్టుకున్నారని.. ఇలాంటి వాటిని భారత దేశం ఎట్టి పరిస్థితిలోనూ సహించబోదన్నారు. గత నాలుగు రోజులు గా భారత సైన్యం సంయమనంతో మన సైన్యం వ్యవహరిస్తోందన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు.
ఉగ్రవాదులపై దాడులు చేయాల్సిన పాకిస్థాన్.. ఎదురు మనపై దాడులు చేసిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత రక్షణ వ్యవస్థ.. పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పిందన్నారు. భారత సైన్యం చూపిన తెగువకు పాక్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింద ని.. అచేతన స్థితికి చేరుకుందని ప్రధాని ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత్ చేస్తున్న దాడులతో పాక్ కు దిమ్మతిరిగిపోయిందని తనదైన శైలిలో ప్రధాని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ వారిని తుడిచి పెట్టేసిందని ప్రధాని తెలిపారు. ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం కచ్చితమైన లక్ష్యంతో దాడులు చేసిందని.. దీంతో పాక్ కు దిక్కులేకుండా పోయిందన్నారు.
మనకు గర్వకారణం..
భారత సైన్యం, రక్షణ వ్యవస్థలు.. వంటివి మన దేశానికి గర్వకారణమని ప్రధాన మంత్రి మోడీ చెప్పుకొచ్చారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు ఇలా.. అన్ని చోట్లా మనం సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉగ్రవాదులకు తగిన విధంగా బుద్ధి చెప్పడంలో మన బలం, బలగం మనకు గర్వకారణమని పేర్కొన్నారు.