-->

సేమ్ ఈక్వేష‌న్‌.. గ‌ట్టి కూట‌మి!

రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వానికి దాదాపు 11 మాసాలు పూర్త‌య్యాయి. ఈ ప‌ద‌కొండు మాసాల్లో చిన్న పాటి ఉపద్ర‌వం కాదు క‌దా.. విభేదం కూడా రాలేదు. క్షేత్ర‌స్థాయి చిన్న‌పాటి గొడ‌వ‌లు.. దూరాలు.. ఉన్నా.. ఉన్న‌త స్థాయిలో మాత్రం క‌లివిడి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో కూట‌మి బ‌లంగానే ఉంద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. ఇక‌, ప‌ద‌వుల పంప‌కం నుంచి గౌరవ మ‌ర్యాద‌ల వ‌ర‌కు కూడా.. కూట‌మి పార్టీల మ‌ధ్య ఎలాంటి తేడా క‌నిపించ‌డం లేదు.

ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం.. మ‌ర్యాద‌లు ఇచ్చిపుచ్చుకోవ‌డం వంటివి మూడు పార్టీల‌ను ఐక్యంగా ఉంచుతున్నా యి. ఇక‌, నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కం విష‌యంలో స‌హ‌జంగానే కూట‌మి పార్టీల మ‌ధ్య అనైక్య‌త ఉంటుంద‌ని.. వ‌స్తుంద‌ని అంచ‌నా వేసుకున్న ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద‌గా ఒరిగింది ఏమీలేదు. ఎందుకంటే.. సేమ్ ఈక్వేష‌న్‌.. సేమ్‌ఫార్ములాను సీఎం చంద్ర‌బాబు పాటిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌రకు పంచిన 100కు పైగా నామినేటెడ్ ప‌దవుల్లో బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు ఆయా పార్టీల ప్ర‌జాప్ర‌తి నిధుల ఆధారంగా సీట్లు ఇస్తున్నారు. ప్ర‌తి సారీ జ‌న‌సేన‌కు 3 త‌గ్గ‌కుండా చూసుకుంటున్నారు. బీజేపీకి ఖ‌చ్చితంగా ఒక సీటును ఇస్తున్నారు. ఇది కూట‌మి ఐక్య‌త‌ను మ‌రోసారి రుజువు చేసింది. అంతేకాదు.. పార్టీల‌కు ప్రాధాన్యం ఇస్తూ.. ఆయా ఎంపిక‌ల‌ను కూడా వారికే వ‌దిలేస్తున్నారు. ఇది కూడా కూట‌మిలో గ‌ట్టి ఐక్య‌త‌ను చాటుతోంది.

ఏపీ వంటి కులాల సంక‌టం, కుల ప్రాధాన్య రాజ‌కీయం ఉన్న రాష్ట్రాల్లో ఏ రెండు పార్టీలు కూడా ఉమ్మ‌డి క‌లిసి ముందుకు సాగ‌డం అనేది ఎక్కువ కాలం ఉంటుంద‌నే చ‌ర్చ లేదు. కానీ.. ప్ర‌స్తుతం ఏర్ప‌డిన కూట‌మిలో ఈ ఐక్య‌త మాత్రం కొన‌సాగుతోంది. ఎవ‌రు దీనిని నిల‌బెడుతున్నారు? అనేది ప‌క్క‌న పెడితే.. క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు మాత్రం బ‌ల‌మైన సంకేతాలు అయితే.. అందుతున్నాయి. దీంతో చిన్న‌పాటి తేడాలు ఉన్నా.. నాయ‌కులు క‌లిసి ఉంటార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.