అమ‌రావ‌తి ‘మ‌ణిహారం’ 70 కాదు 140 మీట‌ర్లు..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి మ‌ణిహారంగా పేర్కొంటున్న ఔట‌ర్ రింగ్ రోడ్డుపై కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఇది 70 మీట‌ర్ల వెడ‌ల్పు కాదని.. ఏకంగా 140 మీట‌ర్ల వెడ‌ల్పని సీఆర్ డీఏ ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి కేంద్రం కూడా అంగీకారం తెలిపిన‌ట్టు పేర్కొంది. వాస్త‌వానికి అమ‌రావ‌తి రింగు రోడ్డు ద్వారా.. మూడు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను రాజ‌ధాని ప‌రిధిలోకి తీసుకురావాల‌ని.. త‌ద్వారా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పుంజుకునేలా చేయాల‌ని ప్ర‌భుత్వం భావించింది.

ఈ క్ర‌మంలోనే 70 మీట‌ర్ల వెడ‌ల్పు(4 లైన్లు)తో ఔట‌ర్ రింగు రోడ్డును 2014-19 మ‌ధ్యే ప్ర‌తిపాదించారు. కానీ, రాష్ట్రంలో 2019లో ప్ర‌భుత్వం మార‌డంలో రాజ‌ధానితో పాటు దీనికి సంబంధించిన అన్ని ప‌నులు కూడా నిలిచిపోయాయి. ఇక, ఔట‌ర్ రింగ్ రోడ్డులో అయితే.. కంక‌ర, ఇసుక వంటివి చోరీకి కూడా గుర‌య్యాయి. గ‌త ఏడాది మ‌ళ్లీ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. రాజ‌ధాని ప‌నులు పుంజుకున్నాయి. ఈ క్ర‌మంలో ఔట‌ర్ రింగ్ రోడ్డు ప్ర‌తిపాద‌న మ‌రోసారి ఊపందుకుంది.

అయితే.. గ‌తంలో 70 మీట‌ర్ల వెడ‌ల్పు.. నాలుగు లైన్ల‌తో ఏర్పాటు చేయాల‌ని అనుకున్న ఈ ర‌హదారిని ఈ ద‌ఫా రెట్టింపు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఏకంగా 8 లేదా ఆరు లైన్ల‌తో దేశంలో నే అతి పెద్ద ఔట‌ర్ రింగ్ రోడ్డును ఇక్క‌డ నిర్మించాల‌ని ప్ర‌ణాళిక వేసింది. అంటే.. మొత్తంగా 140 మీట‌ర్ల వెడ‌ల్పు మేర కు ర‌హ‌దారిని నిర్మిస్తున్నారు. అయితే.. ఆదిలో కేంద్ర ర‌హ‌దారుల శాఖ కేవ‌లం 70 మీట‌ర్ల వెడ‌ల్పుకు మాత్ర‌మే ఆమోదం తెలిపింది.

దీంతో ఇప్పుడు పెరిగిన మ‌రో 70 మీట‌ర్ల వెడ‌ల్పు బాధ్య‌త‌ను త‌మ‌పై పెట్టొద్ద‌ని కేంద్రం పేర్కొంది. ఈ క్ర‌మంలో భూ స‌మీక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యాన్ని రాష్ట్రం భ‌రించేలా (1200 కోట్ల రూపాయ‌లుపైగానే) ఒప్పం దం కుదిరింది. అంటే.. 70 మీట‌ర్ల వెడ‌ల్పుతో నిర్మించే ర‌హ‌దారికి కేంద్రం పూర్తిగా, మ‌రో 70 మీట‌ర్ల వెడ‌ల్పున‌కు అయ్యే ర‌హ‌దారి నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే భూ సేక‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సొమ్ము వెచ్చించ‌నుంది. మొత్తంగా అమ‌రావ‌తి మ‌ణిహారంగా పేర్కొంటున్న ఈ ఔట‌ర్ రింగ్ రోడ్డు క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో నిర్మాణం కానుంది.