అయితే.. అతి చేయడం, లేకపోతే సైలెంట్ అయిపోవడం.. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారంగా మారింది. దీంతో నియోజకవర్గంలో సమస్యలు పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ప్రజలు ప్రతిపక్ష నాయకుల ను ఆశ్రయిస్తున్నారు. ఉదాహరణకు తిరువూరు, సత్యవేడు, కడప సహా పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే.. ఈ ఎమ్మెల్యేలు ఉంటే దూకుడుగా లేకపోతే.. మౌనంగా ఉంటున్నారు.
తిరువూరు ఎమ్మెల్యే విషయం అందరికీ తెలిసిందే. ఆయన వివాదాలకు కేరాఫ్‌గా మారారు. అధిష్టానం హెచ్చరించడంతో పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తన మకాంను కూడా హైదరాబాద్‌కు మార్చేసుకున్నారని తెలిసింది. ఇక, కడపలోనూ ఎమ్మెల్యే మాధవీరెడ్డి దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. తన సొంత పార్టీ నాయకులపైనా ముక్కుసూటిగా వ్యవహరించి వివాదాలు తెచ్చుకున్నారు. దీంతో కొన్ని రోజుల కిందట నారా లోకేష్ హెచ్చరించారు. దీంతో ఆమె సైలెంట్ అయిపోయారు.
ఇక, సత్యవేడు ఎమ్మెల్యే తీరు వేరేగా ఉంది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత.. కేసు నమోదైంది. మొత్తంగా ఆయన ఆ కేసు నుంచి బయటకు వచ్చారు. కానీ, నియోజకవర్గానికి దూరంగా చెన్నై, బెంగళూరుకు పరిమితం అయ్యారు. దీంతో ఈ నియోజకవర్గంలోనూ ప్రజలకు ఎమ్మెల్యే దూరమై మయ్యారన్న చర్చ జరుగుతోంది. ఆయన కుమారుడు చక్రం తిప్పుతున్నా.. ప్రజలు ఆయనను పట్టించు కోవడం లేదు.
ఈ నియోజకవర్గాలు పైకి కనిపిస్తున్నా.. ఇంకా చాలా వరకు నియోజకవర్గాల్లో నాయకులు దూకుడుగా ఉండడం.. అదిష్టానం హెచ్చరించడంతో మౌనంగా ఉండిపోవడం కామన్ అయింది. ఇలా చేయడం వల్ల ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అయింది. తిరువూరు, సత్యవేడు నియోజకవర్గాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేయడంతో ఇక్కడివారంతా వైసీపీ నాయకులను ఆశ్రయిస్తున్నారు. సత్యవేడులో అయితే.. తిరుపతి ఎంపీ హవా కొనసాగుతోంది. సో.. అలా కాకుండా.. నాయకులు ఆలోచించి అడుగులు వేస్తే..ఈ సమస్యలు వచ్చేవి కావన్నది పరిశీలకుల అంచనా.