రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత.. భయంకరమైన అభిమానుల కోలాహలం.. ఇంత పెద్ద హంగామా ఉన్న పవన్ కల్యాణ్.. కన్నీటి పర్యంతమయ్యారు. పక్కవారి కష్టాన్ని చూసి ఆయన చలించిపోయారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చే క్రమంలో ఆయనా కన్నీరు పెట్టుకున్నారు. ఆపరేషన్ సిందూర్ లో పాల్గొని జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో పాక్ ఎదురు కాల్పుల్లో అమరవీరుడైనా అనంతపురం జిల్లా కిళ్లి తండాకు చెందిన అగ్నివీర్ మురళీనాయక్.. అంత్యక్రియల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఉదయం మంత్రులు నారా లోకేష్.. అనిత, సవితలతో కలిసి వీర జవాన్ ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్ అంత్యక్రియల ఘట్టం వరకు అక్కడే ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడిని శత్రుదేశం పొట్టన పెట్టుకున్న తీరుతో అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రుల కన్నీటి సుడిలో చిక్కుకుపోయారు. తీవ్ర విషాద భరితమైన అలాంటి సందర్భంగా వారిని ఓదార్చలేక పవన్ కల్యాణ్ వారి బాధను చూసి.. గుండెలు అవిసేలా విలపిస్తున్న జ్యోతిబాయిని చూసి కన్నీరు పెట్టుకున్నారు.
అతికష్టం మీద వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అంతిమ సంస్కారానికి పార్థివ దేహం వెడలుతున్న సమయంలో మరింతగా ఆ మాతృమూర్తి కన్నీటిలో కరిగిపోయారు. కొడుకా.. కొడుకా.. అంటూ తలబాదు కుంటూ.. తన దిక్కులు పిక్కటిల్లేలా విలపించారు. ఇక, కొడుకు అమరడైన బాధను పంటిబిగువన భరించిన ఆయన తండ్రి.. అతి కష్టం మీద అంత్యక్రియల కోసం ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో తుది వరకు పాల్గొన్న పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, అనిత సహా పలువురు విషణ్ణ వదనాలతో కనిపించారు.