కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో రెండు పథకాలకు మరో 30 రోజుల్లో మోక్షం లభించనుంది. అదేవిధంగా మరో కీలక కార్యక్రమానికి కూడా ఆయన ఈ నెలలోనే శ్రీకారం చుట్టనున్నారు. దీంతో జనాల చేతులలోకి దండిగానే సొమ్ములు రానున్నాయని కూటమి పార్టీల నాయకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో రంగం కూడా రెడీ అయిందని అంటున్నారు. ఈ కార్యక్రమాల అమలుతో ప్రజల మోముల్లో చిరునవ్వులు కనిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
1) అన్నదాత సుఖీభవ: ఎన్నికల కు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్‌లో ఇది కీలక పథకం. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీగా రూ.20 వేల చొప్పున ఇచ్చే ఈ పథకానికి ఈ నెల 20తో నమోదు కార్యక్రమం పూర్తి కానుంది. ఇప్పటికే అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని వాటిని అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లను పరుగులు పెట్టిస్తోంది. దీంతో ఇప్పటికే చాలా వరకు జిల్లాల్లో ఈ నమోదు కార్యక్రమం వాయు వేగంతో సాగుతోంది. ఈ నెల 20 నాటికి జాబితాలు రెడీ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే.. ఆ వెంటనే లబ్ధి దారులను ఎంపిక చేసి.. పథకాన్ని అందించనున్నారు.
2) ఎస్సీ కార్పొరేషన్ రుణాలు: ఇది ఎన్నికల హామీ కాకపోయినా.. గత ప్రభుత్వం విస్మరించి పథకమనే విషయం తెలిసిందే. ఎస్సీ సామాజిక వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు తిరిగి ప్రారంభించారు. దీని కింద ఎస్సీలుగా ఉన్నవారు.. చేతి వృత్తులు, వ్యాపారాలు చేసుకునే దరకాస్తు చేసుకుంటే.. వీరికి గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు నిధులు రుణంగా అందిస్తారు. దీనిలో 50 శాతం సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరించనుంది. దీనికి కూడా.. ఈ నెల 20తోనే లాస్ట్ డేట్. అనంతరం.. జిల్లాల్లో ఎంపిక చేసిన వారికి నిధులు అందనున్నాయి.
3) తల్లికి వందనం: ఈ పథకాన్ని జూన్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. స్కూల్‌కు వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15000 చొప్పున ఇచ్చే పథకానికి ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్‌లో కీలక పాత్ర ఉంది. దీంతో మహిళల ఓటు బ్యాంకు పూర్తిగా కూటమికే పడిందన్న చర్చకూడా ఉంది. తాజాగా దీనికి సంబంధించిన అర్హుల జాబితాను కూడా.. ఈ నెల 20 కే పూర్తి చేయాలని నిర్ణయించారు. అనంతరం.. వీరిలో పూర్తిస్థాయి అర్హులను ఎంపిక చేసి.. వారికి జూన్ తొలివారంలోనే నిధులు బ్యాంకుల్లో వేయనున్నారు. మొత్తంగా వచ్చే 30 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల చేతుల్లో సొమ్ములు ఉండనున్నాయి.