ఏపీలో ఇప్పుడు ఓ విచిత్ర వాతావరణం నెలకొంది. ఐధేళ్ల పాటు వైసీపీ రాష్ట్రాన్ని పాలించగా… రాష్ట్ర ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి అధికారం నుంచి దించేసి… టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమిని గద్దెనెక్కించారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటూ పలు కేసులు నమోదు చేసిన కూటమి సర్కారు… వాటి దర్యాప్తునకు ఏకంగా సిఐడీ, సిట్, లోకల్ పోలీస్ విభాగాలను రంగంలోకి దించింది. ఆదిలో ఈ కేసులకు నిందితులు ఓ రేంజిలో భయపడ్డారు. అదేంటో తెలియదు గానీ… ఇప్పుడు ఈ కేసులన్నా, పోలీసుల విచారణలన్నా వారు అస్సలు పట్టించుకోవడం లేదు. ఖాకీలను పిచ్చ లైట్ తీసుకుంటున్నారు. విచారణకు రమ్మంటే కనిపించకుండా పోతున్నారు. వారి కోసం గాలింపు కూడా జరుగుతున్న దాఖలా కనిపించడం లేదు.
ఏపీలో మద్యం కుంభకోణం పెను కలకలమే రేపుతోంది. ఈ కేసులో అంతిమ లబ్ధిదారు నాటి సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని పోలీసుల విచారణకు హాజరైన వారు ఇప్పటికే చెప్పినట్లుగా సమాచారం. అయితే ఆ లింకులను మరింత పక్కాగా రాబట్టేందుకు నాడు జగన్ వద్ద సీఎంఓ కార్యదర్శిగా కొనసాగిన ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ ఫ్యామిలీ నేతృత్వంలోని భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేర్చి వారిని విచారణకు పిలవగా… రాత్రికి రాత్రే వారు పత్తా లేకుండాపోయారు. దీంతో హైదరాబాద్ లోని వారి ఇళ్లకు వెళ్లిన పోలీసలుు అలా నోటీసులు ఇచ్చి ఇలా వెనుదిరిగి వచ్చారు.
ఇక అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే నెలల తరబడి పోలీసులకు చుక్కలు చూపిస్తున్న వైనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నిసార్లు ఆయన ఇళ్లకు పోలీసులు వెళ్లినా… ఇప్పుడే కాకాణి బయటకు వెళ్లిపోయారు అంటూ సమాధానం వస్తోందట. మరి కాకాణి ఆచూకీని పోలీసులు ఎప్పటికి కనుగొంటారో చూడాలి. ఇప్పుడు ఆయన బాటలోనే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కూడా ఏపీ పోలీసులకు పట్టపగలే చుక్కలు చూపారు. తానెక్కడుంటున్నానో… వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఆయన సాగిన తీరు నిజంగానే పోలీసులకు తలవంపులు తెచ్చిందని చెప్పక తప్పదు. తీరా కోర్టు నుంచి ఉపశమనం దొరగ్గానే ఆయన రాప్తాడు చేరుకున్నారు.
ఇక నిన్నటికి నిన్న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గతంలో జరిగిన దాడికి సంబంధించిన కేసు విచారణకు వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు కదా.ఈ విచారణలో సజ్జల ఇచ్చిన ఆన్సర్లు విని పోలీసులే షాకయ్యారట. అరెరే.. టీడీపీ కార్యాలయంపై నాడు దాడి జరిగిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన సజ్జల… ఏదో ధర్నాకు వెళుతున్నామని మాత్రమే నాడు తనకు చెప్పారని ఆయన ఈ కేసు విచారణను చాలా లైట్ తీసుకున్నారట. ఇక ఈ కేసులో ఇప్పటిదాకా ఇద్దరు, ముగ్గురు అరెస్టు అయితే… వారంతా ఇప్పుడు బెయిల్ పై బయటే ఉన్నారు. ఇక కొత్తగా అరెస్టులేమీ జరిగే సూచనలూ కనిపిస్తలేవు. అంటే కేసులపై పోలీసులు అంత సీరియస్ గా కదలడం లేదన్న వాదనలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి.