భారత్-పాకిస్థాన్‌ల మధ్య తలెత్తిన భీకర ఉద్రిక్తతలు.. దాడులకు ఫుల్ స్టాప్ పడింది. దీనిని యావత్ భారత దేశం హర్షిస్తోంది. అయితే.. అమెరికా మీడియా సహా.. పలు ప్రపంచ స్థాయి మీడియా చానెళ్లు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఆయన జోక్యం కారణంగానే పాక్-భారత్ ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలకు..యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కూడా సమసిపోయాయని.. పేర్కొంటున్నాయి. ట్రంప్ ఈజ్ హీరో.. అంటూ అమెరికా మీడియా సీఎన్ ఎన్ పేర్కొంది. న్యూయార్క్ టైమ్స్ మాత్రం ఆచి తూచి స్పందించింది. ట్రంప్ ప్రతిపాదన
అంటూ.. రాసుకొచ్చింది.
అయితే.. భారతీయులు సహా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత సంతతి పౌరులు మాత్రం ఈ విజయం పక్కా మోడీదేనని చెబు తున్నారు. శాంతి కాముక దేశంగా భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన మోడీ.. భారత్-పాక్ విషయంలోనూ అదే పంథాను అనుసరించారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ మేరకు నెటిజన్లు మోడీకి జేజేలు పలుకుతున్నారు. ప్రధానంగా ఇక్కడ ట్రంప్ విజయం అని పేర్కొనడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. సర్వశక్తి మంతంగా ఉండి కూడా.. భారత్ ఈ విషయంలో ఒక అడుగు వెనక్కి వేసిందంటే.. అది మోడీ విజయమే తప్ప.. ట్రంప్‌ది కాదని తేల్చి చెబుతున్నారు.
దీనికి రెండు ప్రధాన కారణాలను నెటిజన్లు చూపిస్తున్నారు. 1) రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఈ విషయంలోనూ ట్రంప్ మధ్యవర్తిత్వం చేశారు. యుద్ధం ఆపేయాలని ఇరు దేశాలకు అనేక సార్లు విన్నవించారు. కానీ.. వీరి మధ్య యుద్ధం ఆగలేదు. అంటే.. ట్రంప్ మధ్యవర్తిత్వం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు అంటున్నారు. 2) గాజా-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, భీకర దాడులను సమసిపోయేలా చేయడంలోనూ ట్రంప్ పాత్రలేదని.. ఇరు వర్గాలు.. ఒక ఒప్పందానికి వచ్చాయని.. ఆ తర్వాతే ఆగాయని అంటున్నారు. అప్పుడు కూడా ఇజ్రాయెల్ మాటు వేసి దాడి చేసిన తీరును కళ్లకు కడుతున్నారు.
ఏతావాతా.. ట్రంప్ చేసిన మధ్యవర్తిత్వం మంచిదే అయినా.. భారత ప్రధాని మోడీ సమరానికి మొగ్గు చూపని కారణంగానే ఇది క్షణాల్లో ఫలితాన్ని ఇచ్చిందన్నది నెటిజన్లు చెబుతున్న మాట. అంతేకాదు.. భారత్ దగ్గర సర్వ సైన్యం ఉందని.. వనరులు కూడా పుష్కలంగానే ఉన్నాయని.. ఎలా చూసుకున్నా.. భారత్ వెనక్కి తగ్గేందుకు అవకాశం లేదని చెబుతున్నారు. పైగా బాధిత దేశం కూడా కావడంతో ఎవరూ వేలు పెట్టి ఆదేశించే పరిస్థితి కూడా లేదని.. అయినా.. మోడీ సహా భారతీయులు సార్వజనీన ప్రయోజనాలను, శాంతికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలోనే ట్రంప్ మధ్యవర్తిత్వం సక్సెస్ అయింది తప్ప.. ఇది ట్రంప్ ఏకపక్ష విజయం కాదనేది వారి మాట. మొత్తానికి మోడీకి నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు.