పాక్ ది ఎంతటి పన్నాగమో తెలుసా..?

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ మాట భారత్ మాత్రమే చెబుతున్నది కాదు. యావత్తు ప్రపంచ దేశాలు పాక్ గురించి ఇదే మాటను చెబుతున్నాయి. పహల్ గాం ఉగ్రదాడికి అన్ని రకాలుగా అండదండలు అందించింది పాకిస్తానే. పహల్ గాం దాడి తర్వాత భారత్ పైకి కవ్వింపు చర్యలకు దిగింది కూడా ఆ దేశమే కదా. వెరసి బారత్ తో ఆ దేశం ఇప్పుడు చేస్తున్న యుద్ధానికి పాక్ భారీ వ్యూహంతోనే సిద్ధం అయ్యిందని చెప్పాలి. ఆ మాట నిజమేనని శుక్రవారం నాటి భారత విదేశాంగ శాఖ, రక్షణ దళాల సంయుక్త మీడియా సమావేశం తేల్చి చెప్పింది.

శుక్రవారం సాయంత్రం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, రక్షణ దళాల ప్రతినిధులు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికి సింగ్ లు పాక్ పన్నాగాన్ని కళ్లకు కట్టారు. ఇందుకు వారు గడచిన రెండు రోజులుగా పాక్ ఏమేం చేసిందన్న అంశాలను వివరించారు. నియంత్రణ రేఖ వెంబడి ఏకంగా 36 చోట్ల పాక్ సైన్యం కాల్పులకు తెగబడిందని వారు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు చనిపోగా… వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయడపడ్డారని తెలిపారు. ఓ వైపు ఉగ్రవాదులకు ప్రోత్సాహం అందిస్తూనే.. వారిని భారత్ లోకి పంపి భారత్ లో అశాంతిని రేకెత్తించే దిశగా పాక్ వ్యవహరిస్తోందని ఆరోపించారు.

గడచిన రెండు రోజులుగా భారత్ లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దాడులు చేసిన పాక్ వందల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించిందని వారు తెలిపారు. పాక్ ఎంచుకున్న లక్ష్యాల్లో మత సంబంధిత ప్రదేశాలు ఉన్నాయని, వాటిలో చర్చిలు, ఆలయాలు ఉన్నాయని తెలిపారు. చనిపోయిన ఇద్దరు చిన్నారులు కూడా క్రైస్తవ మిషనరీలో చదువుతున్న పిల్లలేనని పేర్కొన్నారు. ఫలితంగా భారత్ లో మతకల్లోలాలు జరిగేలా వ్యూహం అమలు చేసిందని తెలిపారు. ఇక అదే సమయంలో ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపేందుకు చొరబాట్లను ఎక్కడికక్కడ ప్రోత్సహించిందని కూడా వారు తెలిపారు.

అయితే పాక్ పన్నాగాలు బారత్ వద్ద కుదరలేదని మిస్రీ తెలిపారు. అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాక్ ఎంతగా కవ్వింపు చర్యలకు పాల్పడినా..,భారత్ ప్రతిదాడులకు దిగలేదని ఆయన తెలిపారు. అయితే పాక్ ప్రయోగించిన డ్రోన్లను ఎక్కడికక్కడ గాల్లోనే పేల్చేశామని తెలిపారు. కౌంటర్ టెర్రర్ అటాక్స్ లో భాగంగా పాక్ కు తీవ్ర స్థాయిలో నష్టం జరిగిందని మిస్రీ వెల్లడించారు. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో శుక్రవారం రాత్రి జరిగే సమావేశాల్లో .పాక్ కు ఎలాంటి ఆర్థిక చేయూత లభించని రీతిలో చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు.