భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు. పలు కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు.. ప్రత్యేకించి పాక్ తో సరిహద్దు ప్రాంతంలోని రాష్ట్రాలకు వెళ్లిన ప్రజలు మరింతగా ఇబ్బంది పడుతున్నారని చెప్పక తప్పదు. ఇలాంటి వారిలో విద్యార్థులదే అదిక శాతమని చెప్పాలి. ప్రస్తుతం కశ్మీర్ కు విద్యాభ్యాసం నిమిత్తం వెళ్లిన వారు తీవ్ర భయాందోళనలో కూరుకుపోయారు. వారిలో ఏపీకి చెందిన వారూ ఉన్నారు.
ఈ విషయంపై ఇప్పటికే ఏపీలోని కూటమి సర్కారు తనదైన శైలి వేగవంతమైన చర్యలు చేపట్టింది. జమ్మ, కశ్మీర్ లోని పలు ప్రాంతాలకు చెందిన విద్యా సంస్థల్లో ఏపీకి చెందిన చాలా మంది విద్యార్థులు చదువుతున్నారు. మొన్నటిదాకా పరిస్థితి బాగానే ఉన్నా… పాక్ ఉగ్రవాద ప్రేరేపిత దాడులు, అంతకుముందు పహల్ గాం ఉగ్రదాడి, తాజాగా ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు…అంతిమంగా ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలముకున్న నేపథ్యంలో అక్కడి మన విద్యార్థులు, ఇక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి కశ్మీర్ లోని మన విద్యార్థులను సురక్షితంగా రప్పించేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఈ పనిని నంద్యాల నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ యువ మహిళా నేత బైరెడ్డి శబరికి అప్పగించారు. లోకేశ్ ఆదేశాలతో నేరుగా రంగంలోకి దిగిన శబరి ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అదికారి లవ్ అగర్వాల్ కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో సమన్వయం చేసుకుని విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి చేర్చాలని అగర్వాల్ కు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ మొత్తం పరిస్థితిని వివరిస్తూ శుక్రవారం ఉదయం లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్ కు విద్యాభ్యాసం నిమిత్తం వెళ్లి.. యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుబడిపోయిన పిల్లల గురించి వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆ ప్రకటనలో లోకేశ్ తెలిపారు. కశ్మీర్ లోని ప్రతి విద్యార్థిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువస్తామని ఆయన తెలిపారు. దీనికి సంబందించి జరుగుతున్న చర్యలను అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు.