పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్.. యుద్ధానికి కారణం కాగా.. పాక్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్ యుద్ధ తీవ్రతను పెంచేస్తోంది. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో దేశ రక్షణ విధుల్లో నిమగ్నమైన తెలుగు జవాన్ మురళి నాయక్ వీర మరణం పొందారు. పాక్ జరిపిన కాల్పుల్లో మురళి మృతి చెందినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి.
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధిలోని కల్లి తండా మురళి నాయక్ స్వస్థలం. స్వస్థలం కల్లీ తండానే అయినా అదే జిల్లా పరిధిలోని సోమందేపల్లి మండల పరిధిలోని నాగినాయని చెరువు తండాలో పెరిగారు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. విద్యాభ్యాసం తర్వాత బారత సైన్యంలో చేరిన మురళి నాయక్… గురువారం నాటి పాక్ చొరబాటుదారులను అడ్డుకునే ఆపరేషన్ లో పాలుపంచుకున్నాడు.
ఈ క్రమంలోనే పాక్ వైపు నుంచి దూసుకువచ్చిన కాల్పుల్లో మురళి నాయక్ వీరమరణం పొందారు. శుక్రవారం ఉదయం మురళి నాయక్ మృతిని ధృవీకరించింది. అదే విషయాన్ని మురళి కుటుంబానికి కూడా చేరవేశారు. ఈ వార్త విన్నంతనే మురళి కుటుంబం కుప్పకూలిపోయింది. రేపు మురళి పార్థీవ దేహాన్ని ఆయన స్వగ్రామం అయిన కల్లి తండాకు చేరనున్నట్లుగా సమాచారం. మురళి మరణ వార్తతో ఆయన స్వగ్రామంలోనే కాకుండా ఏపీవ్యాప్తంగా విషాధ ఛాయలు అలముకున్నాయి.
ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వీర జవాన్ మరణానికి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. యుద్ధంలో మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సదరు సంతాపంలో చంద్రబాబు పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళికి నివాళి అర్పించిన బాబు… మురళి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లు కూడా మురళి వీర మరణంపై సంతాపం తెలుపుతూ ప్రకటనలు జారీ చేశారు.