వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పనిచేస్తోందని ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ యువనాయకుడు, మంత్రి నారా లోకేష్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులపాటు తిరుపతిలో పర్యటన నిమిత్తం బుధవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయన.. కొద్ది సేపటికే.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో రాత్రి 11 గంటల వరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకులు ప్రస్తావించారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. రెడ్‌బుక్‌పై అనుమానం అవసరం లేదని.. దానిని తాను వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.
“వైసీపీ నాయకులు రెడ్‌బుక్ నడుస్తోందని చెబుతున్నారు. కానీ, చాలా మంది మన వాళ్లు రెడ్ బుక్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఒక్కటే చెబుతున్నా.. నేను పాదయాత్రలో ఎవరి పేర్లు అయితే రాసుకున్నానో.. అందరికీ రెడ్ బుక్ సమాధానం చెబుతుంది. దానిని వదిలేది లేదు. ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు.“ అని నారా లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో కేసులు పెట్టించుకున్నవారు.. జైలుకు వెళ్లిన వారిబాధలు తనకు తెలుసునన్న నారా లోకేష్.. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా రెడ్‌బుక్ చూసుకుంటుందని, ఆ విషయాన్ని తనకు వదిలేయాలని ఆయన సూచించారు.
ఇక, పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం చాలానే ఉందని నాయకులకు లోకేష్ సూచించారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి మరో నెలకు ఏడాది అవుతుందన్నారు. ఇప్పటి వరకు పార్టీపరంగా పెద్దగా కార్యక్రమాలు చేపట్టలేదన్న ఆయన.. ఇక నుంచి పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు మొదలు కానున్నాయని వివరించారు. మహానాడును ఘనంగా నిర్వహించుకుందామని.. మహానాడు వేదికగా.. పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలను నిర్దేశించనున్నట్టు తెలిపారు. ఆయా కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లే బాధ్యత పూర్తిగా నాయకులు కార్యకర్తలపైనే ఉంటుందని లోకేష్ చెప్పారు.
ఈ విషయంలో తాను ప్రతి నాయకుడు, కార్యకర్తను అనుసరిస్తానని..వారు ఏం చేస్తున్నారో.. ఏం చేయాలో కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు లోకేష్ చెప్పారు. కష్టపడిన వారికి మాత్రమే పదవులు దక్కుతాయని ఈ సందర్భంగా తెలిపారు. తన చుట్టు తిరిగితే.. పదవులు దక్కబోవని, ప్రజల మధ్య ఉంటే.. ఆటోమేటిక్‌గానే పదవులు వస్తాయన్నారు. తనకు మంత్రి పదవి ఎలా వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందేనని.. తాను కూడా ప్రజల్లో ఉండి.. పాదయాత్ర చేయబట్టే మంత్రి పదవి ఇచ్చారని.. ఇలానే పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా పదవులు దక్కుతాయని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు.