భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఈ దాడులు నిర్వహించబడ్డాయి. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది ప్రధాన స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. బహవల్పూర్, మురిడ్కే, సియాల్‌కోట్ వంటి ప్రాంతాలపై గగనతల, భూభాగం నుంచి సమన్విత దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్ లో 90మందికి పైగా ఉగ్ర వాదులు హతమయ్యారని తెలుస్తోంది.
ఈ ఆపరేషన్ పేరు వెనుక ప్రత్యేక అర్థం ఉంది. సాధారణంగా ‘సిందూర్’ అంటే భారతీయ సంప్రదాయంలో వివాహిత మహిళలు ధరించే గుర్తు. కానీ ఈ సందర్భంలో, పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన దారుణ దాడిని గుర్తు చేసేలా, అర్థభరితంగా ఈ ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని పేరు పెట్టారు. ఆ దాడిలో ఉగ్రవాదులు మతం ఆధారంగా పౌరులను హతమార్చిన విషయం తెలిసిందే.
భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ ద్వారా పహల్గామ్‌లో హతమైన అమాయకులకు ఒక విధమైన న్యాయం జరగిందని చూపించాలనుకుంది. ‘సిందూర్’ అనే పదం హిందు మహిళల రక్షణకు, గౌరవానికి ఒక చిహ్నంలా కూడా పనిచేస్తుంది. దానికి తగ్గట్టే, మరణించిన వారికి నివాళి అర్పించే విధంగా ఈ చర్య భారత గౌరవాన్ని నిలబెట్టే సంకేతంగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ దాడులను పర్యవేక్షించారని భద్రతా వర్గాలు వెల్లడించాయి. పాక్ సైనిక స్థావరాల్ని కాకుండా, కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలపైనే దాడులు జరపడం ద్వారా భారత్ తర్కబద్ధంగా వ్యవహరించిందని అధికారులు తెలిపారు. ఈ చర్య తర్వాత సరిహద్దుల వద్ద ఉద్రిక్తత మరింత పెరగడంతో, అంతర్జాతీయ దృష్టి ఈ పరిణామాలపై కేంద్రీకృతమవుతోంది.