ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిపతి, మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సహా మరికొందరికి తాజాగా నాంపల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా విచారించిన .. నాటి సీబీఐ జాయింట్ డైరెక్టర్.. వీవీ లక్ష్మీనారాయణ, ఉరఫ్ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా నాటి అనుభవాలను.. కేసు విచారణకు సంబంధించిన కీలక విషయాలను ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. గాలి జనార్దన్‌రెడ్డి అంత ఈజీగా తమకు దొరకలేదని వివరించారు. ఆయనను అరెస్టు చేయకుండా.. అనేక వ్యవస్థలు తమపై ఒత్తిడి పెంచాయన్నారు.
“అసలు కేసు నమోదైన తర్వాత..ఎటు నుంచి విచారణను ప్రారంభించాలన్నది పెద్ద ప్రశ్న. దీనిని ఛేదించేందుకు సమయం పట్టింది. పైగా కొన్ని కీలక వ్యవస్థలు.. ఆయన వెనకే ఉన్నాయి. ఈ సమయంలో ఎలా విచారణ ప్రారంభించాలో కూడా మాకు అర్థం కాలేదు” అని జేడీ వివరించారు. మైనింగ్ కేసు రెండు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉందని.. దీంతో అటు వైపు అధికారులు, ఇటు వైపు అధికారులు కూడా సహకరించాలని, కానీ, ఈ విషయంలో అధికారులు సహకరించడం తలకు మించిన పనిగా మారిందన్నారు. కీలక అధికారులు తాము విచారణకు వస్తున్నామని తెలిసి సెలవులపై వెళ్లిపోయేవారని చెప్పారు.
‘సీబీఐ అధికారులమని చెబితే.. గాలి జనార్దన్‌రెడ్డి మనుషులు తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తారని భావించాం. అందుకే.. ఐటీ అధికారులమని చెప్పి.. కేవలం తనిఖీల కోసమని చెప్పి వెళ్లి ఆయనను అరెస్టు చేశాం. అంతేకాదు.. ఆయన అరెస్టు అయ్యారన్న వార్తను అత్యంత గోప్యంగా ఉంచాం.ఈ విషయంలో ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డాం. మా ఫోన్లను పక్కన పెట్టేశాం. అరెస్టు తర్వాత.. మాకు బెదిరింపులు వస్తాయని కొందరు అన్నారు. కానీ.. పక్కా ఆధారాలతో కేసును ఫైల్ చేశాం” అని వివరించారు.
అంతేకాదు.. ఈ కేసు విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నం సాగాయని జేడీ వివరించారు. తమ చేతిలోని అధికారులను బదిలీ చేయించేవారని.. దీంతో ఈ రోజు ఉన్న అధికారి రేపు ఉంటాడో ఉండడో తెలియని పరిస్థితిని ఎదుర్కొన్నామని జేడీ వివరించారు. ఇక, ఇలాంటి కేసులు విచారించేవారు.. సహజంగా ఎదుర్కొనే ఒత్తిళ్లు తనపైనా ప్రభావం చూపించాయన్నారు. ఇంత జాప్యం(14 సంవత్సరాలు) జరగడానికి రాజకీయ పరమైన బదిలీలు కారణమై ఉంటాయన్నారు. కానీ, ఇలాంటి కేసులు జరగకుండా ఉండేందుకు సత్వర పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates