పాక్ పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడికి భారత్ రివేంజ్ తీర్చుకుంది. 1971 తర్వాత తొలిసారిగా పాక్ భూభాగంలోకి చొరబడి మరీ క్షిపణి దాడులు నిర్వహించింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్ తో పాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి దాదాపుగా 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

భారత ఆర్మీ, భారత ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా పూర్తి చేశాయి. పాక్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను మిస్సైల్స్ ధ్వంసం చేశాయి. అయితే, ఇది పాకిస్తాన్ పై దాడి కాదని, కేవలం పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి మాత్రమేనని భారత ఆర్మీ ట్వీట్ చేసింది.

పూర్తి కచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాలపై మాత్రమే మిసైల్ దాడులు చేశామని స్పష్టం చేసింది. పాకిస్తాన్ పౌరులు, పాకిస్తాన్ ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని భారత్ ఆర్మీ స్పష్టం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 1.44 నిమిషాలకు ఈ దాడులు చేపట్టినట్లు భారత ఆర్మీ అధికారికంగా ట్వీట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోడీ ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించారు. ఈ దాడిపై భారత ఆర్మీ ఈరోజు ఉదయం 10 గంటలకు అధికారికంగా పూర్తి సమాచారంతో వివరాలు వెల్లడించనుంది. మరోవైపు, ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన సిసిఎస్ సమావేశం జరగబోతుందని తెలుస్తోంది.

ఈ మెరుపు దాడుల నేపథ్యంలోనే భారత్, పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జస్టిస్ సర్వ్ డ్ అంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. మరోవైపు, భారత దాడులను పాక్ ఆర్మీ ధృవీకరించింది. పాకిస్థాన్ లోని కోట్లి, ముడకీ, బహబల్పూర్, ముజఫరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లుగా తెలిపింది. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని, 12 మందికి గాయాలయ్యాయి తెలిపింది. భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని పాకిస్తాన్ డీజీ ఐఎస్పిఆర్ఎస్ జనరల్ అహ్మద్ షరీఫ్ అన్నారు. ఈ దాడులపై పాక్ ప్రధాని షాబాద్ షరీఫ్ కూడా స్పందించారు. పాకిస్థాన్లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిగాయని, ఈ దాడికి పాక్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని అన్నారు.