-->

అమరావతిలో ‘బసవతారకం’కు మరో 6 ఎకరాలు

టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం కేన్సర్ ఆసుపత్రి పేదలకు ఏ మేర సేవలు అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు టీడీపీ వ్యవస్తాపకుడు దివంగత నందమూరి తారక రామారావు నెలకొల్పిన ఈ ఆసుపత్రిని ఆ తర్వాత బాలయ్య పర్యవేక్షిస్తున్నారు. తెలుగు నేల విభజన తర్వాత బసవతారకం ఆసుపత్రి సేవలను ఏపీకి కూడా విస్తరించాలని బాలయ్య నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని మరింతగా విస్తరించిన బాలయ్య.. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో బసవతారకం ఆసుపత్రితో పాటుగా మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.

వాస్తవానికి ఏపీకి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన నాడే…అమరావతిలో బసవతారకం ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని బాలయ్య తలచారు. ఈ నిర్ణయానికి నాటి టీడీపీ సర్కారు అంగీకరించడంతో పాటుగా ఆసుపత్రి నిర్మాణం కోసం అమరావతి పరిధిలో 15 ఎకరాల స్థలాన్ని ఇదివరకే కేటాయించింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో పరిస్థితి అంతా మారిపోయింది. అమరావతి పనులు అటకెక్కాయి. అంతేకాకుండా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే దిశగా నాటి వైసీపీ సర్కారు ఎక్కడికక్కడ బ్రేకులు వేసుకుంటూ సాగింది. ఫలితంగా అమరావతిలో బసవతారకం ఆసుపత్రి నిర్మాణం విషయాన్ని బాలయ్య పక్కన పెట్టక తప్పలేదు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు తిరిగి అధికారంలోకి రావడంతో అమరావతిలో బసవతారకం ఆసుపత్రి అంశాన్ని బాలయ్య ప్రయారిటీగా తీసుకున్నారు.

తాజాగా అమరావతిలో బసవతారకం ఆసుపత్రితో పాటు ఆసుపత్రికి అనుబంధంగా ఓ మెడికల్ కాలేజీ కూడా కడతానని బాలయ్య ప్రభుత్వానికి నివేదించారు. అందుకోసం ఇదివరకు కేటాయించిన 15 ఎకరాల భూమికి అదనంగా మరో 6 ఎకరాల భూమిని కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి వివిధ సంస్థల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం… ఆయా సంస్థలకు భూములను కేటాయిస్తూ మంగళవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బాలయ్య ప్రతిపాదనలకూ సానుకూలంగా స్పందించిన కూటమి సర్కారు…బసవతారకం ఆసుపత్రి కోసం గతంలో కేటాయించిన 15 ఎకరాలకు అదనంగా మరో 6 ఎకరాలను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

బసవతారకం ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవలు తెలుగు నేలలోనే కాకుండా యావత్తు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి పేద కేన్సర్ రోగులకు అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనని చెప్పక తప్పదు. సేవలో బసవతారకం ఆసుపత్రిని ఓ ల్యాండ్ మార్క్ గా నిలపడంలో బాలయ్య సఫలం అయ్యారని చెప్పక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో బసవతారకం ఆసుపత్రితో పాటుగా కొత్తగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీని కూడా బాలయ్య దేశంలో అత్యున్నత వైద్య కళాశాలగా తీర్చిదిద్దుతారనడంలో ఎలాంటి సందేహం లేదన్న మాట అయితే గట్టిగానే వినిపిస్తోంది.