సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్న కాంక్షతో వడివడిగా ముందుకు సాగుతున్న చంద్రబాబు.. అదే సమయంలో తాను తీసుకుంటున్న నిర్ణయాల్లో వచ్చే ఫలితం ఆధారంగా.. తన పార్టీ ప్రభావాన్ని.. రాబోయే మేలును కూడా ఆయన అంచనా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని నిర్ణయాలు.. వాటి ద్వారా ఒనగూరే ఓటు బ్యాంకు లెక్కలు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇలాంటి వ్యూహమే ఇప్పుడు మరోటి తెరమీదికి వచ్చింది.
జగన్‌కు, వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలు. గత ఎన్నికల్లో కొంత మేరకు జగన్‌ను వీరు వదిలేసినా..వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ వారంతా జగన్‌కు చేరువయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు. అయితే.. ఇది రాజకీయంగా చూసుకుంటే టీడీపీకి, కూటమి పార్టీలకు కూడా ఇబ్బందే. దీనిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు తాజాగా బలమైన స్ట్రాటజీని తెరమీదికి తెచ్చారు. ఎస్సీ,ఎస్టీ వర్గాలకు వరంగా మారిన విదేశీ విద్య పథకాన్ని తిరిగి పట్టాలెక్కిస్తున్నారు.
గతంలో అంబేడ్కర్ పేరుతో ఉన్న ఈ పథకాన్ని జగన్ తన పేరుతో మార్చుకున్నారు. ఇది నిరసనలకు, వివాదాలకు కూడా కారణమైంది. అయినా.. జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీల కోరిక మేరకు ఈ పథకానికి తిరిగి అంబేడ్కర్ పేరును పెడుతున్నారు. ఇదొక మైలు రాయి. ఇక, ఈ పథకంలో నిధులను భారీ ఎత్తున సామాజిక వర్గాల ఆధారంగా పెంచుతున్నారు. ఇది మరో కీలక మైలురాయిగా మారనుంది. పైగా.. ఇది వైసీపీ ఓటు బ్యాంకుకు తీవ్ర స్థాయిలో గండిపడేలా చేయనుంది.
ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటే.. రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం సాయం చేయనుంది. ఇది ఆయా వర్గాలను పూర్తిగా చంద్రబాబు వైపు మళ్లించనుంది. ఇక, బీసీలు, ఈడబ్ల్యూఎస్ పరిధిలోని ఓసీ వర్గాలకు రూ.10 లక్షల చొప్పున సాయం చేయనున్నారు. ఇలా.. వర్గీకరించి మరీ సాయం అందించడం ద్వారా.. ఆయా ఓటు బ్యాంకులు మొత్తంగా గుండుగుత్తగా చంద్రబాబుకు అనుకూలంగా మారడం ఖాయమని నాయకులు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates