తొందరలోనే టీటీడీ ఎఫ్ఎం రేడియో

సుమారు ఆరు మాసాల్లోపు తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని భక్తుల ఎప్పటి నుండో కోరుతున్నారు. ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో కేంద్రం ఏర్పాటు చేసుకుంటే వెంకటేశ్వరస్వామి భక్తి పాటలు, అన్నమయ్య కీర్తనలు, శ్రీవారి పూజా కైంకర్యాలను, తిరుమల ఆలయంలో జరిగే కల్యాణోత్సవాలను ప్రతిరోజు వినే భాగ్యం దక్కుతుందని భక్తులు చాలా కాలంగా అడుగుతున్నారు.

భక్తుల నుండి పెరిగిపోతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని టీటీడీ పాలకవర్గం కూడా సానుకూలంగా స్పందించింది. ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాలు మొత్తానికి ఓ రూపుకొచ్చాయి. టీటీడీ తరపున ప్రత్యేకంగా ఓ ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవటానికి కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ అనుమతించింది.

ఎస్వీబీసీ ఛానల్ కార్యాలయం నుండి ఎఫ్ఎం రేడియో ప్రసారాలు కూడా మొదలవుతాయి. ఇక్కడే కార్యక్రమాలను రూపకల్పన కూడా జరగటానికి టీటీడీ బోర్డు సమావేశంలో ఆమోదం దక్కింది. ఏపీ, తమిళనాడు, కర్నాటకలోని దూరదర్శన్ ప్రసారాలకు ఉపయోగిస్తున్న టవర్లను ఉపయోగించుకునేట్లుగా అనుమతి తీసుకున్నది టీటీడీ యాజమాన్యం. కాబట్టి తిరుపతి నుండి పై టవర్ల ద్వారా 100 కిలోమీటర్ల పరిధిలో ప్రతిరోజు శ్రీవారి భక్తి కార్యక్రమాలు, అన్నమయ్య పాటలు, పూజా విధానాలతో పాటు తిరుమలలో జరిగే అనౌన్స్ మెంట్లు కూడా భక్తులు వినచ్చు.