అదిరిపోయేలా ‘మ‌హానాడు’.. ఈ ద‌ఫా మార్పు ఇదే!

టీడీపీకి ప్రాణ స‌మాన‌మైన కార్య‌క్ర‌మం ఏదైనా ఉంటే.. అది మ‌హానాడే. దివంగ‌త ముఖ్య‌మంత్రి, తెలుగువారిఅన్న‌గారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని.. దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా ఈ మ‌హానాడును నిర్విరామంగా నిర్వ‌హిస్తున్నారు. ఒక్క క‌రోనా స‌మ‌యంలోనే వ‌ర్చువ‌ల్‌గా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇక‌, పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. మ‌హానాడుకు భారీ ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. కాగా.. ఈ సారి నిర్వ‌హించే మ‌హానాడుకు రెండు ప్ర‌ధాన ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయ‌ని పార్టీనాయ‌కులు చెబుతున్నారు. దీంతో మ‌హానాడును మ‌రింత సంబ‌రంగా నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు.

1) పార్టీ అధినేత చంద్ర‌బాబుకు 75 వ‌సంతాలుపూర్తి అయిన నేప‌థ్యంలో జ‌రుగుతున్న మ‌హానాడు కావ‌డం. 2) కూట‌మి స‌ర్కారుకు బ‌ల‌మైన మ‌ద్ద‌తు ద‌క్క‌డం.. మ‌రో ప‌దేళ్ల‌పాటు అధికారంపై ఎలాంటి సందేహాలు లేక‌పోవ‌డం. ఈ రెండు అంశాలు బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో మ‌హానాడుకు ఈ ద‌ఫా ప్రాధాన్యం మ‌రింత పెరిగింద‌ని నాయ‌కులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. టీడీపీ హిస్ట‌రీలో మ‌రీ ముఖ్యంగా మ‌హానాడు చ‌రిత్ర‌లో తొలిసారి క‌డ‌ప‌లో నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో దీనిని మ‌రింత ప్ర‌తిష్టా త్మ‌కంగా తీసుకోనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర జిల్లాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. క‌డ‌ప‌లో పార్టీ వీక్‌గానే ఉంది.

అలాంటిది గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ పుంజుకుని..క‌డ‌ప‌లోనూ కొంత మేర‌కు చొచ్చుకుపోయింది. కీల‌మైన క‌మ‌లాపురం, క‌డ‌ప స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సైకిల్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌రింత‌గా పార్టీని బ‌లోపేతం చేసేందుకు.. ముఖ్యంగా క‌డ‌ప‌లో వైసీపీ హ‌వాకు బ్రేకులు వేసేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇలా.. ప‌లు కార‌ణాల నేప‌థ్యంలో ఈ సారి మ‌హానాడుకు మ‌రింత ప్రాధాన్యం ఏర్ప‌డింద‌ని తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్నారు. ఇక‌, మ‌హానాడు ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తే.. గ‌తంలో నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో నాయ‌కుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించేవారు. పార్టీ త‌ర‌ఫున కార్య‌క‌ర్త‌ల‌ను త‌ర‌లించే అవ‌కాశం ఇచ్చారు.

కానీ, ఈ సారి మాత్రం మండ‌ల స్థాయి నుంచి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను మొబిలైజ్ చేస్తున్నారు. సుమారు 5 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు కార్య‌క‌ర్త‌ల‌ను త‌ర‌లించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇక‌, మ‌హానాడుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు 7 సార్లు చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌తో వీడియో కాన్ఫ‌రెన్సులు నిర్వ‌హించారు. ఐటీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కుప్ర‌చార బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అదేవిధంగా క‌డ‌ప ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఏ ర్పాట్లు చేసే బాధ్య‌త భుజాన పెట్టారు. అయితే.. మ‌రిన్నిక‌మిటీల‌ను వేయాల్సి ఉంది. భోజ‌నాలు, అతిథుల‌ను ఆహ్వానించ‌డం, వ‌స‌తి ఏర్పాట్లు చేయ‌డం, కార్య‌క‌ర్త‌లకు సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డం వంటి కీల‌క బాధ్య‌త‌ల‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది.