వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు .. రాష్ట్ర రాజధాని అమరావతిపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అదేసమయంలో రాజధాని విషయంలో మూడు ముక్కలాట మరిచి పోయినట్టు ఆయన కామెంట్లు చేశారు. “జగనే అమరావతిని అభివృద్ధి చేయాలని అనుకున్నాడు. కానీ, చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు” అని తాజాగా అంబటి మీడియా ముందు కామెంట్లు చేశారు.
దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఎక్కడైనా.. ఎవరైనా.. రాజధానిని బాగు చేస్తానని అంటే.. అడ్డుకుంటారా? అసలు రాజధానిని బాగు చేయమనే కదా.. నాడు అసెంబ్లీలో చేతులు జోడించి చంద్రబాబు వేడుకుంది! కానీ, మీరు చేసిందేంటి? అని ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతులను అసహ్యించుకున్నారు. వారి త్యాగాలను.. నాటకాలుగా.. కులం పేరు అంటగట్టి చీదరించుకుని లాఠీలతో కుమ్మించారు.. అని గతాన్ని గుర్తు చేస్తున్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన అంబటి.. శుక్రవారం జరిగిన రాజధాని పనుల పునః ప్రారంభంపై అక్కసు వెళ్లగక్కారు. ఈ సభా వేదికగా.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అబద్ధాలు చెప్పారని అన్నారు. అమరావతి నిర్మాణంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారని విమర్శించారు. కానీ.. వాస్తవానికి అమరావతి నిర్మాణం చేపట్టి.. ప్రారంభించి.. పనులు జరుగుతున్న సమయంలోనే కదా.. ఎన్నికలు వచ్చి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందని.. మరి ఆ పనులను మీరెందుకు కొనసాగించలేదు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
“అమరావతి కోసం గత చంద్రబాబు ప్రభుత్వంలో 41 వేల కోట్ల రూపాయలకు పైగా టెండర్లు పిలిచారు. 5500 కోట్లు ఖర్చు చేశారు. గత ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో అమరావతి భ్రమరావతి అయింది.” అని అంబటి నోరుపారేసుకున్నారు. ఆ నిర్మాణాలే కదా.. ఇప్పుడున్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు.. వంటివి. మీరు పాలించిన ఐదేళ్లు కూడా అక్కడ నుంచే పాలన సాగించారు కదా? అనేది నెటిజన్ల ప్రశ్న.
రాజధాని విషయంలో ప్రజలు అమరావతిని అంగీకరించి.. ఒక నిర్ణయానికి వచ్చాకే.. 2024లో మార్పు వచ్చిందని.. 11 స్థానాలకేమిమ్మల్ని పరిమితం చేశారని అంటున్నారు. ఈ నిజాన్ని వైసీపీ నాయకులు గుర్తించలేకపోతే.. ఇంకా ఇలానే వ్యవహరిస్తే.. వైసీపీ పేరు కూడా కనుమరుగయ్యే అవకాశం కొద్ది దూరంలోనే ఉందని అంటున్నారు నెటిజన్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates