నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు అమరావతి పరిధిలోని వెలగపూడి సచివాలయం వెనుక ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభా వేదిక మీద నుంచే మోదీ… అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అమరావతి పనులతో పాటుగా ఏపీలో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులను కూడా మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా ప్రసంగించిన మోదీ… అమరావతిని ఓ నగరంగా కాకుండా ఓ శక్తిగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అని కూడా ఆయన అభివర్ణించారు. తన ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించిన మోదీ… తన ప్రసంగంలో పలుమార్లు తెలుగు పదాలను పలుకుతూ సభకు హాజరైన వారిని ఉర్రూతలూగించారు.
అమరావతిని రానున్న మూడేళ్లలోనే పూర్తి చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన మోదీ… ఆ శక్తి ఏపీ ప్రజలకు, కూటమి సర్కారుకు ఉందని తెలిపారు. పనులను చక్కబెట్టడంలోనే కాకుండా… ఆయా పనులను నాణ్యతా ప్రమాణాలతో కూడా సకాలంలో పూర్తి చేసే సత్తా చంద్రబాబుకు ఉందని కూడా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో అప్పటికే చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉన్నారని, నాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు పనితనాన్ని చూశానని, దానిపై తాను అధ్యయనం చేశానని, అధికారులను పంపి అధ్యయనం చేయించానని కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రానున్న మూడేళ్లలోనే పూర్తి అవుతుందన్న నమ్మకం తనకు ఉందని కూడా మోదీ అన్నారు. ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్న మోదీ… ఆ దిశగా ఏఫీకి ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
అమరావతిని ఏపీకి రాజధానిగా మాత్రమే చూడదలచుకోలేదన్న మోదీ… వికసిత్ భారత్ లో భాగంగానే అమరావతిని చూడాలనుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతుందని చెప్పిన మోదీ… ఇదే వేగాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా మోదీ ఏపీ ప్రజల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కలలు కనే వారు ఎక్కువగా ఉన్నారన్న మోదీ… కలలను కనే వారితో పాటుగా వాటిని సాకారం చేసుకుంటున్న వారు కూడా ఏపీలో అధికంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏపీకి గతంలో కంటే మెరుగైన రీతిలో కేంద్ర నిధులను కేటాయిస్తున్నామన్న మోదీ… రైల్వే కేటాయింపుల్లోనూ ఏపీతో పాటు తెలంగాణకు కూడా భారీ ఎత్తున నిదులను కేటాయిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు కోరినట్టుగా ఈ ఏడాది ప్రచంచ యోగా దినోత్సవ వేడుకలకు తాను ఏపీకి వస్తానని కూడా మోదీ ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates