రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి అన్నగారు.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరు వచ్చింది. “ఎన్టీఆర్.. వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్నారు. ఆ కలలను మనం(చంద్రబాబు-పవన్-మోడీ) సాకారం చేద్దాం” అని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మోడీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ పేరును బహిరంగంగా ప్రకటించింది కానీ.. ఆయన పేరును తలుచుకున్నది కానీ.. ఎప్పుడూ లేదు. కానీ.. తాజాగా మాత్రం ఎన్టీఆర్ పేరును మూడు సార్లు ప్రస్తావించారు.
అంటే.. దీనిని బట్టి తెలుగు వారి అన్న.. గురించి మోడీకి సవివరంగా తెలిసే ఉంటుంది. లేదా..ఇప్పటికైనా ఆయన తెలుసుకుని ఉంటారు. వాస్తవానికి అన్నగారు ఉన్న సమయంలో నేరుగా మోడీ రాజకీయాల్లోకి రాలేదు. కాబట్టి.. ఆయన సీఎంగా ఉన్న సమయం గురించి మోడీకి తెలియకపోయి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఆయన గురించి గతంలో ఎప్పుడూ మోడీ వ్యాఖ్యానించలేదని అనుకోవాలి. సరే.. ఇప్పుడు కారణాలు ఏవైనా మోడీ.. పదే పదే అమరావతిలో నిర్వహించిన సభలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. చిత్రం ఏంటంటే.. మోడీ నోటి నుంచి ఎన్టీఆర్ పేరు వచ్చిన ప్రతిసారీ.. సభకు వచ్చిన ప్రజల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబుకు కీలక అవకాశం వచ్చిందని పార్టీ అభిమానులు అంటున్నారు. అన్న ఎన్టీఆర్‌కు భారత రత్న తీసుకురావాలన్నది పార్టీ నాయకులే కాదు.. యావత్ తెలుగు జాతి కూడా.. పార్టీలకు కులాలకు అతీతంగా కోరుకుంటున్న మాట వాస్తవం. ఈ విషయంలో గతంలో వైసీపీ నాయకులు కూడా తాము ప్రయత్నిస్తున్నామని చెప్పడం కొసమెరుపు. సో.. ఇప్పుడు మోడీనే అన్నగారి పేరును ప్రస్తావించిన నేపథ్యంలో ఎన్టీఆర్ కీర్తి గురించి..ఆయన అందించిన సేవ గురించి ప్రత్యేకంగా మోడీకి చెప్పాల్సిన అవసరం లేదు.
ఒక్క ఏపీకే కాకుండా.. తమిళనాడుకు నీటిని అందించిన ఘనత కూడా ఎన్టీఆర్ కే దక్కుతుంది. కేంద్రంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసింది కూడా ఎన్టీఆర్. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. సో.. ఇటుసేవల పరంగా.. అటు రాజకీయంగా కూడా ఎన్టీఆర్ విశ్వవిఖ్యాతం చెందారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో చిన్న చిరు ప్రయత్నం చేస్తే.. చంద్రబాబు హయాంలోనే ఈ టర్మ్‌లోనే .. అన్నగారికి అద్వితీయమైన భారతరత్న దక్కడం పెద్ద సమస్య కాదని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates