వైసీపీ ‘ష‌ఫిలింగ్’ పాలిటిక్స్ స‌క్సెస్ అయ్యేనా..?

గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీచేసిన ప్ర‌యోగాల గురించి అంద‌రికీ తెలిసిందే. ఒక‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాయ‌కుల‌ను మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి మార్చేశారు. స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గం నేత‌ను డ‌మ్మీ చేశారు. ఇక‌, ఒక జిల్లా నేత‌ను మ‌రో జిల్లాకు మార్చాల‌ని అనుకున్నా.. అది దెబ్బ కొడుతుంద‌ని అనుకున్నారు. దీంతో కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఈ మార్పులు కొన‌సాగాయి. అయితే.. ఈ మార్పులు స‌క్సెస్ కాక‌పోగా.. పార్టీ వ్య‌వ‌స్థీకృతంగా కూడా భారీగా దెబ్బ‌తింది. ప‌నిచేసే నాయ‌కులు కూడా ప‌డ‌కెక్కారు. ఫ‌లితంగా పార్టీ 11 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది.

క‌ట్ చేస్తే.. ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత‌.. ప‌ది మాసాల‌కు ఇప్పుడు మ‌రో ప్ర‌యోగం దిశ‌గా వైసీపీ కీల‌క అడుగులు వేసింది. తాజాగా ష‌ఫిలింగ్ రాజ‌కీయాల‌కు తెర‌దీసింది. అంటే.. అస‌లు ఏమాత్రం జిల్లాతో సంబంధం లేని నాయ‌కుల‌ను.. అందునా ద్వితీయ శ్రేణి నాయ‌కులుగా ఉన్న వారిని పొరుగు జిల్లాల‌కు కేటాయించి.. పార్ల‌మెంటు స్థానాల‌ను అప్ప‌గించింది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. ఒక పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నాయ‌కులు ఆ ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోని నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని పార్టీని నిల‌బెట్టే బాధ్య‌త‌ల‌ను భుజాల‌కెత్తుకోవాలి.

కానీ, ఈ త‌ర‌హా ప్ర‌యోగాలు స‌క్సెస్ కావ‌ని తెలుస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ‌లోనే ప‌ట్టు లేని, కార్పొరేట‌ర్ స్థాయి నాయ‌కు డు పూనూరు గౌతం రెడ్డిని ఏకంగా.. బ‌ల‌మైన న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిశీల‌కుడిగా వైసీపీ నియ‌మించింది. నిజానికి పూనూరు మాట విజ‌య‌వాడ‌లోనే చెల్లుబాటు కాద‌న్న వాద‌న ఉంది. అలాంటిది భిన్న‌మైన రాజ‌కీయాలు.. టీడీపీ వ్య‌వ‌స్థీకృతంగా ఎంతో బ‌లంగా ఉన్న న‌ర‌స‌రావుపేట‌లో గౌతం రెడ్డి ఏమేర‌కు పార్టీని పుంజుకునేలా చేస్తార‌న్నది ఖ‌చ్చితంగా మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రి ఏం చూసి ఆయ‌న‌కు ఈ బాధ్య‌త ఇచ్చారో చూడాలి.

ఇక‌, గుంటూరుకు చెందిన మోదుగుల వేణుగోపాల రెడ్డికి బ‌ల‌మైన విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానం వైసీపీ ప‌రిశీల‌కుడిగా నియ‌మించారు. నిజానికి గ‌త ఐదేళ్ల కింద‌ట ఉన్న ప‌రిస్థితిలో మోదుగుల లేరు. యాక్టివ్‌గా కూడా ఉండ‌లేక పోతున్నారు. కానీ, విజ‌యవాడ రాజ‌కీయాలు మాత్రం హాట్ హాట్‌గా ఉన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న వ‌చ్చి ఏమేర‌కు చ‌క్క‌దిద్దుతారో.. పార్టీని ఎలా ముందుకు న‌డిపిస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇక‌, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, వ‌య‌సు రీత్యా వృద్ధాప్యంలో ఉన్న జంకే వెంక‌ట‌రెడ్డిని నిత్యం రాజ‌కీయాలు మారుతున్న నెల్లూరులో కేటాయించారు. ఇక్క‌డ కూట‌మి ఇప్పుడు బ‌లంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో అనేది సందేహ‌మే. మ‌రి వైసీపీ చేస్తున్న ఈ ష‌ఫిలింగ్ పాలిటిక్స్ మ‌రోసారి విక‌టిస్తే.. క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.