విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ప్రమాద ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. గోడపై టెంట్ పడడంతో అది కూలి దాని కింద భక్తులు సజీవ సమాధి అయ్యారు. ఈ క్రమంలోనే ఆ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని, ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడానని చంద్రబాబు తెలిపారు.
సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబసభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగావకాశం కల్పించాలని ఆదేశించారు. మంత్రులు అనిత డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ భరత్, మంత్రి అనగాని సత్యప్రసాద్, సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తదితరులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ ప్రమాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ దుర్ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మంత్రి లోకేశ్ అన్నారు. విశాఖ కేజీ హెచ్ ఆసుపత్రిలో గాయపడిన వారికి చికిత్స జరుగుతోందని, బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు లోకేశ్. మరోవైపు, శిథిలాలను తొలగించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఆలయ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates