వైసీపీ మద్యం కుంభకోణంలో తీగ లాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి.. డొంకలు కదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ హయాంలో మద్యం పాలసీని అడ్డు పెట్టుకుని దోచుకున్న కీలక నాయకుడి చుట్టూ.. ఉచ్చు బిగిస్తోందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. ప్రస్తుతం ఈయన కూడా సిట్‌లో సభ్యుడిగా ఉన్నారు. మద్యం ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు తయారు చేసేశారు? అనే విషయాలపై ఇప్పటికే ఆరా తీశారు.
ఇప్పుడు.. ఈ మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన లాభాల్లో ఎవరు ఎవరికి ఎంతెంత మొత్తం ఇచ్చారన్న విషయంపైనా కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో ఎవరిని కదిలించినా.. జగన్ వైపే వేళ్లు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని సదరు అధికారి వెల్లడించడం గమనార్హం. “ఇప్పటి వరకు.. కీలకమైన నలుగురిని విచారించాం. అందరూ చెబుతున్న దానిని బట్టి.. ముఖ్య నాయకుడి పేరు వినిపిస్తోంది” అని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే.. ఇప్పటికిప్పుడు సదరు నేతపై కేసు నమోదు చేసే అవకాశం లేదని.. మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం సీరియస్‌గానే ఉందన్నారు. వాస్తవానికి ఆదిలో తనకు సంబంధం లేదని తప్పించుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డి.. తర్వాత ఈ విషయంలో తాను సూచనలు మాత్రమే చేశానని చెప్పుకొచ్చారు.కానీ, దీనిపై లోతుగా విచారించిన అధికారులకు ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచి ఎంపీ పాత్ర ఎక్కువగానే ఉందని తేలినట్టు తెలిసింది.
“ఎన్నికలకు సమయం వస్తోంది. వాళ్లు కూటమి కడితే.. మనం ఎక్కువగా ఖర్చు చేయాలి. ఏదో ఒకటి చేసి.. డబ్బులు పోగేసుకోండి. మనోళ్లందరికీ.. సొమ్ములు చేరాలి” అని ముఖ్య నాయకుడు ఆదేశించినట్టు విచారణకు వచ్చిన వారిలో ఒకరు(పేరు చెప్పలేదు) వెల్లడించినట్టు సదరు అధికారి గోప్యంగా చెప్పడం గమనార్హం. విషయం ఏదైనా.. అన్నీ తాడేపల్లి నుంచే జరిగాయని.. దీనిపై ఎలాంటి అనుమానం లేదన్నారు. సో.. మొత్తానికి తీగ లాగారు.. డొంక కదిలిందని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates