‘ధరణి’పై కేసీఆర్ సర్కారుకు టీ హైకోర్టు షాక్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల పంటగా చెప్పే ధరణి ఆస్తుల నమోదు ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయటమే కాదు.. సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. ధరణిలో ఆస్తుల నమోదు విషయంలో వ్యక్తిగత వివరాల భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది. కొత్త రెవెన్యూ చట్టం సాగు భూములకు సంబంధించింది మాత్రమేనని.. డేటా భద్రతకు సంబంధించి కొత్త రెవెన్యూ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదని పేర్కొంది.

అంతేకాదు.. ధరణి పోర్టల్ లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీల వివరాల నమోదుపైనా హైకోర్టు స్టే విధించింది. ధరణి పోర్టల్ లో భద్రతా పరమైన అంశాలపై పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధరణిలో నాన్ అగ్రిక్లచర్ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దన్న ఆదేశాల్ని జారీ చేసింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక అంశాల్ని ప్రస్తావించింది.

గూగుల్ ప్లేస్టోర్ లో ధరణి పోర్టల్ ను పోలిన మరో నాలుగు యాప్స్ ఉన్నాయన్న హైకోర్టు.. అందులో ఏది అసలైన ధరణి పోర్టల్ అనేది తెలుసుకోవటం ప్రజలకు ఇబ్బందిగా మారుతోందన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీలకు సంబంధించి ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారో తమకు తెలపాలని కోరింది. చట్టబద్ధత.. డేటా భద్రతపై పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని పేర్కొంది.

ధరణి వెబ్ పోర్టల్ లో నాన్ అగ్రికల్చరల్ ఆస్తుల్ని నమోదు చేసుకోవాలని బలవంతం పెట్టుకూడదని పేర్కొంది. తాము కోరిన అంశాలపై ప్రభుత్వం తన నివేదిక అందించే వరకు..ఎలాంటి నమోదు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 20కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.