“ఏపీ ప్రభుత్వం చెబుతున్న సమాచారాన్ని బట్టి.. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడం కుదరదు. ఏదైనా ఉంటే.. ఏపీ హైకోర్టులోనే తేల్చుకో“ అని వైసీపీ నాయకుడు, సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుప డ్డ బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని.. నకిలీ వైద్య సర్టిఫికెట్‌ను సమర్పించి.. ఏపీ హైకోర్టును తప్పుదోవ పట్టించి.. మోస పూరితంగా గతంలో బెయిల్ పొందారన్న ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది.
“కోర్టులను తప్పుదోవ పట్టించిన వారికి సమాజం పట్ల ఏం బాధ్యత ఉంటుంది? ఇలాంటి వారికి బెయిల్ ఇచ్చి మేం పొరపాటు చేయలేం. ఏదైనా చెప్పాలని అనుకుంటే హైకోర్టులోనే చెప్పుకోండి“ అని బోరుగడ్డ తరఫున న్యాయవాది వాదనలు వినిపించేందుకు సిద్ధమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇతనికి బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేస్తూ.. కేవలం 10 నిమిషాల్లోనే పిటిషన్‌ను తోసిపుచ్చింది. శుక్రవారం బోరుగడ్డ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కోర్టు సమయం చివరి గంటలో విచారణకు వచ్చింది. దీనిపై ధర్మాసనం తొలుత విచారణ చేపట్టాలని అనుకున్నా.. ఏపీ ప్రభుత్వ న్యాయవాది, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గమనించిన తర్వాత.. విరమించుకుంది.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నోటికి ఎంత మాట పడితే.. అంత మాట అనేసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న కేసులో బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను పోలీసులు నెల రోజుల కిందట అరెస్టు చేశారు. రాజమండ్రి జైలుకు తరలించారు. కానీ, తన తల్లికి ఆరోగ్యంబాగోలేదని, చెన్నైలో చికిత్స పొందుతున్నారని చెబుతూ.. ఆయన బెయిల్ కోసం అప్లయి చేశారు. ఈ క్రమంలో హైకోర్టుకు ఆయన నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. దీనిని ముందుగా గుర్తించని కోర్టు.. బోరుగడ్డకు బెయిల్ ఇచ్చింది. మధ్యలోవిషయం వెలుగులోకి వచ్చేసరికి బెయిల్ గడువు కూడా పూర్తయింది. వెంటనే ఎక్కడున్నా వచ్చి జైలు అధికారుల ముందు లొంగి పోవాలని కోర్టు సూచించింది.
ఈ క్రమంలో రాజమండ్రి జైలుకు వచ్చి లొంగిపోయిన బోరుగడ్డ.. మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. అయితే.. దీనిపై విచారణ కూడా చేపట్టలేమని.. ముందు నకిలీ సర్టిఫికెట్ వ్యవహారం తేలాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో బోరుగడ్డ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి.. బెయిల్ పొందాలని చూశారు. కానీ, సుప్రీంకోర్టు ఆయన ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ.. ఇలాంటివాడికి తాము బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.