నో డౌట్‌: కాళేశ్వ‌రం బ్యారేజీలు ప‌నికిరావు…!

తెలంగాణ ఏర్పాటై తొలి ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేశాక కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప్రాజెక్టు కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌. ఈ ప్రాజెక్టును ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. కేసీఆర్ ఈ కాళేశ్వ‌రం ప్రాజెక్టు త‌న‌ను ఎల్ల‌కాలం తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ఉంచుతుంద‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నారు. వ‌రుస‌గా మూడోసారి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి తెలంగాణ రైతాంగం అంతా త‌న‌కు ఓట్లేస్తుంద‌ని క‌ల‌లు క‌న్నారు. అయితే ఎన్నిక‌ల‌కు కేవ‌లం కొద్ది రోజుల ముందు కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌గుళ్లు విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో కేసీఆర్ ప్లాన్ అంతా రివ‌ర్స్ అయ్యింది. కేసీఆర్ మూడోసారి ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల‌లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.

ఇక ఇప్పుడు కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి ఓ బాధాక‌ర‌మైన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాళేశ్వరంలో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఉపయోగపడవని.. ఒక వేళ వాటిని ఉప‌యోగిస్తే ఏ క్ష‌ణంలో అయినా కొట్టుకుపోయే అవ‌కాశం ఉంద‌ని నేషనల్ డ్యామ్ ప్రొటెక్షన్ అధారిటీ నివేదిక సమర్పించింది. వీటిని రీ డిజైన్ చేసి మ‌ళ్లీ నిర్మించాలే త‌ప్పా వీటిని య‌ధావిథిగా వాడ‌కూడ‌ద‌ని తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు డిజైన్‌లో అన్నీ లోపాలే ఉన్నాయ‌ని క్లీయ‌ర్‌గా చెప్పింది. ఇక మూడు బ్యారేజీల్లోనూ సీకెంట్‌ ఫైల్స్‌ కూలిపోవడంతో పాటు బ్యారేజ్ పై భాగంలోనూ.. ఇటు కింది భాగంలోనూ రంధ్రాలు ఉన్న‌ట్టు గుర్తించార‌ట‌. ప‌లు ప‌రీక్ష‌ల త‌ర్వాత 14 నెల‌ల పాటు అధ్య‌య‌నం చేసిన త‌ర్వాతే NDSA ఈ రిపోర్టు ఇచ్చింది.

బ్యారేజీల నిర్మాణం చేసే విష‌యంలో చేయాల్సిన భూసార ప‌రీక్ష‌లు చేయ‌లేద‌న్న విష‌యం కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల‌ను ఒక చోట క‌ట్టాల‌న్న ప్ర‌తిపాద‌న‌లు ప‌క్క‌న పెట్టేసి.. మ‌రో చోట‌కు మార్చార‌ట‌. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 ప్రకారం వ‌ర్షాకాలానికి ముందు బ్యారేజీలు ఎలా ఉన్నాయ‌న్న అంశాన్ని సైతం ప‌రిశీలించ‌లేద‌ని కూడా రిపోర్టులో పేర్కొంది. ఏదేమైనా ప్రాజెక్టు నిర్మాణాలు, నిర్వ‌హ‌ణ‌తో పాటు డిజైన్ లోపాలు ఉన్నాయ‌ని తేల్చేయ‌డంతో ఇది రాజ‌కీయంగాను తీవ్ర క‌ల‌క‌లం రేపే అవ‌కాశాలు ఉన్నాయి. దీనికి తోడు కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఈ రిపోర్టు అత్యంత కీలకం కానుంది.

నాడు బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో మంత్రులుగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న హ‌రీష్‌రావు, కేటీఆర్‌ను ఈ విష‌యంలో ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంద‌ని.. అలాగే ఇది బీఆర్ఎస్‌కు పెద్ద ఎదురు దెబ్బే అని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Read Complete article here: