పహల్గామ్ దాడి: ఐదుగురు ఉగ్రవాదుల గుర్తింపు… ముగ్గురూ పాక్‌కు చెందినవారే!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడి దర్యాప్తులో కీలక పురోగతి నమోదైంది. బైసరన్ మైదానంలో అమాయక పర్యాటకులపై జరిగిన కాల్పులకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అధికారులు గుర్తించారు. ఇందులో ముగ్గురు పాకిస్తాన్‌ లు కాగా, ఇద్దరు జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. దాడి అనంతరం వీరు పీర్ పంజాల్ పర్వతాల్లోకి పారిపోయినట్టు అనుమానిస్తున్నారు.

గుర్తించబడిన పాక్ ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ అలియాస్ మూసా, సులేమాన్ షా అలియాస్ యూనస్, అబు తల్హా అలియాస్ ఆసిఫ్. ఇద్దరు స్థానికులు అనంతనాగ్‌కి చెందిన ఆదిల్ గురి, పుల్వామా వాసి అహ్సాన్. వీరిద్దరూ 2018లో పాక్ వెళ్లి శిక్షణ పొందారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ దాడిలో పాలుపంచుకున్న ఆసిఫ్ ఫౌజీ ఇప్పటికే పూంచ్‌ దాడితోపాటు పలువురు సైనికుల హత్యలకూ సంబంధం ఉన్నట్లు సమాచారం.

ప్రాథమిక దర్యాప్తులో పహల్గామ్ దాడి సమయంలో ఉగ్రవాదులు మతంపై దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. మగవారిని టార్గెట్ చేస్తూ, మతాన్ని నిరూపించుకునేలా ప్రశ్నలు వేసి అనంతరం కాల్చినట్లు ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాల ద్వారా తేలింది. అక్కడ సీసీటీవీలు లేకపోవడంతో బాధితుల కథనాలే దర్యాప్తుకు ఆధారమవుతున్నాయి.

ఇప్పటికే ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లు విడుదల చేసిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు, వారిని పట్టించుకునే వారికి రూ. 20 లక్షల రివార్డు ప్రకటించారు. ముఖ్యంగా మూసా పేరుతో పనిచేస్తున్న ఆసిఫ్ ఫౌజీపై కేంద్ర నిఘా సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. అతను ఈ ఏడాది పూంచ్ దాడిలోనూ కీలకంగా వ్యవహరించినట్టు అంచనా. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ అధికారికంగా చేపట్టింది. ఎన్ఐఏ అధికారి విజయ్ సఖారే నేతృత్వంలో ప్రత్యేక బృందం శ్రీనగర్‌లో విచారణను పర్యవేక్షిస్తోంది. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ప్రమేయం ఉన్నదన్న కోణంలో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.