పాక్ రక్తం పారిస్తే!… భారత్ నీళ్లను ఆపేసింది!

అప్పుడెప్పుడో 9 ఏళ్ల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట నుంచి వచ్చిన మాటలు నేడు నిజమయ్యాయి. 2016లో సరిహద్దులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వల్ల నెలకొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో “ఒకే సమయంలో, ఒకే చోట నెత్తురు, నీళ్లు ప్రవహించవు” అని మోదీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలను తిరిగి పలకాల్సిన అవసరం గానీ, వాటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం గానీ రాలేదనే చెప్పాలి. పాక్ ఎప్పటికప్పుడు పిల్ల చేష్టలకు పాల్పడ్డా కూడా భారత్ పెద్దన్న తరహాలో ఏనాడూ కఠిన నిర్ణయాలను తీసుకోలేదు. అయితే పెహల్ గాం ఉగ్రదాడి నేపథ్యంలో తొమ్మిదేళ్ల క్రితం తన నోటి నుంచి వచ్చిన మాటను మోదీ నిజం చేసి చూపారు. ఈ పరిణామం పాక్ ను నీటి కోసం అల్లాడే పరిస్థితిని తీసుకురానుందని చెప్పక తప్పదు.

ఉగ్ర దాడి నేపథ్యంలో బుధవారం జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భారత్ నిర్ణయించింది. ఈ నిర్ణయం నిజంగానే పాక్ లో నీటి కోసం అల్లాడే పరిస్థితిని తీసుకురానుందని చెప్పాలి. ఎందుకంటే… సింధూ నదికి ఎగువన భారత్ ఉంటే… దిగువన పాకిస్తాన్ ఉంది. ఎగువన ఉన్న ప్రాంతాలను నీళ్లను నిలిపిస్తే.. దిగువన ఉన్న ప్రాంతాలకు నీటి కొరత తప్పదు కదా. ఇప్పుడు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా ఎగువన ఉన్న భారత్… సింధూ జలాలను ఒడిసిపట్టనుంది. ఫలితంగా దిగువన ఉండే పాక్ నీటి కోసం అర్రులు చాచడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ దిశగా గతంలో మునుపెన్నడూ భారత్ కఠిన నిర్ణయం తీసుకోలేదనే చెప్పాలి. అయితే ఈ దఫా మాత్రం పాక్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పకపోతే.. ఆ దేశం సాగిస్తున్న దుశ్చర్యలకు అడ్డుకట్ట ఉండదన్న భావనతో ఒకింత కఠినమైనా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

దేశ విభజన తర్వాత బారత్, పాకిస్తాన్ ల మధ్య ప్రవహిస్తున్న సింధూ, దాని ఉప నదుల జలాల పంపిణీపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో దాదాపుగా 9 ఏళ్ల పాటు జరిగిన ఈ చర్చలు 1960లో ఓ కొలిక్కి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం… సింధూ ఉప నదులైన బియాస్, రావి, సట్లెజ్ నదులపై భారత్ కు… సింధూ, జీలం, చీనాబ్ లపై పాక్ కు హక్కులు దక్కాయి. సాధారణంగా పడమర నుంచి తూర్పు వైపు ప్రవహించే నదుల నీటితోనే భారత్ అవసరాలు తీరుతున్నాయి. తూర్పు నుంచి పడమర వైపుగా ప్రవహించే సింధూ నదీజలాలు భారత్ కు అంతగా అవసరం లేదనే చెప్పాలి. ఈ కారణంగా సింధూ నదీ జలాలను బారత్ పెద్దగా వినియోగించున్నదే లేదు. ఫలితంగా దిగువన ఉన్నా కూడా పాక్ 80 శాతం మేర సింధూ నదీ జలాలను వినియోగించుకుంటోంది. ఈ నదీ జలాలే పాక్ కు పెద్ద దిక్కు అని కూడా చెప్పక తప్పదు.

అయితే ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ ఒప్పందాన్నిరద్దు చేసుకోవడం ద్వారా సింధూ నదీ జలాలకు బారత్ అడ్డుకట్ట వేయనుంది. అంటే… ఎగువన ఉన్న భారత్ సింధూ నదీ జలాలకు అడ్డుకట్ట వేస్తే…దిగువన ఉన్న పాక్ కు ఈ నదీ జలాలు అందడం కష్టమే కదా. ఇప్పుడు అదే జరగనుంది. భారత్ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ద్వారా పాక్ కు సింధూ నది నుంచి చుక్క నీరు కూడా అందదు. ఫలితంగా సింధూ నదీ జలాలపై ఆధారపడ్డ పాక్ ప్రాంతాలు ఎడారిగా మారడం ఖాయమేనని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య మళ్లీ సఖ్యత ఎప్పుడు కుదురుతుందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో… అసలు పాక్ లోని ఈ ప్రాంతాలకు ఎప్పటికి ఉపశమనం లభిస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తంగా పెహల్ గాం ఉగ్ర దాడి పాక్ ను ఎండగడుతోందని చెప్పాలి.

సింధూ నదీ జలాల ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకారం తెలపగా… 1960లోనే ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది. నాటి నుంచి నేటి దాకా ఏ తరహా పరిస్థితులు వచ్చినా కూడా ఈ ఒప్పందంపై పున:పరిశీలన గానీ, ఒప్పందం నిలిపివేత దిశగా అడుగులు గానీ పడలేదు. పాక్ ఎప్పటికప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా నిలిచినా కూడా భారత్ ఈ ఒప్పంద జోలికి వెళ్లలేదు. 1965, 71ల్లోల జరిగిన యుద్ధాలు, 2001లో జరిగిన పార్లమెంటుపై దాడి, 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడుల సమయంలోనూ బారత్ ఈ ఒప్పందంపై పున:పరిశీలన చేయనే లేదు. కనీసం ఈ ఒప్పందాన్ని పున:పరిశీలన చేయాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని కూడా బారత్ ఆశ్రయించలేదు. అయితే పెహల్ గాం ఉగ్ర దాడి బారత్ ను తీవ్రంగా గాయపరచింది. ఫలితంగానే ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పాలి.