ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో టిడిపి నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నాగులుప్పలపాడు మండల టిడిపి అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అయిన వీరయ్య చౌదరిని గుర్తు తెలియని దుండగులు పాశవికంగా హతమార్చారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరి ఉండగా కత్తులతో నలుగురు వ్యక్తులు దాడి చేసి హత మార్చారు.
ఈ క్రమంలోనే వీరయ్య చౌదరి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న వెంటనే హోం మంత్రి అనిత, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్, ఇతర అధికారులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితి సమీక్షించారు. ఆ నలుగురు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని అనిత చెప్పారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారం తాను ఘటనా స్థలానికి వచ్చానని అనిత వెల్లడించారు.
నిందితుల కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయని , సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును త్వరలో ఛేదిస్తామని అనిత చెప్పారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు, రాజకీయ కక్షలు, వ్యక్తిగత కారణాలు…ఇలా అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు మేనల్లుడు అయిన వీరయ్య చౌదరి అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.