తెలంగాణ గొప్పతనాన్ని దశదిశలా చాటుతామని చెప్పిన వారు… ఏం చేశారో.. ఏమో తెలియదుకానీ.. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం నిజంగానే ఆ పనిచేశారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆయన.. తెలంగాణ కీర్తిని అక్కడ రెపరెపలాడించారు. జపాన్‌లో ఏటా.. ఏప్రిల్ మధ్య వారం నుంచి `ఒసాకా` ఎక్స్‌పో నిర్వహిస్తారు. ఇది చాలా ప్రతిష్టాత్మకం. పెద్ద పెద్ద కంపెనీలే కాదు.. పెద్ద పెద్ద దేశాలకు చెందిన వారే పాల్గొంటారు.
ఇప్పటి వరకు మన దేశం నుంచి ఏ ఒక్క రాష్ట్రానికి `ఒసాకా ఎక్స్‌పో`లో పాల్గొనే అదృష్టం దక్కలేదు. గత ఏడాది మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు ప్రయత్నించినా.. కొన్ని కారణాలతో ఆయా రాష్ట్రాలను నిర్వాహకులు అనుమతించలేదు. కాగా.. ఇప్పుడు తొలిసారి సీఎం రేవంత్ నేతృత్వంలో తెలంగాణ సర్కారుకు ఒసాకాఎక్స్‌పో అవకాశం దక్కింది. అంతేకాదు.. అక్కడ పెవిలియన్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశం చిక్కింది.
తాజాగా తెలంగాణ పెవిలియన్(ఈ ఎక్స్‌పో జరిగినన్నాళ్లు ఇది ఉంటుంది. పైగా అంతర్జాతీయ ఎక్స్‌పో మేగజైన్స్‌లోనూ ప్రముఖంగా ప్రచురిస్తారు)ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో పెట్టుబడులకు సువర్ణావకాశం వచ్చిందని ఈ సందర్భంగా చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లోతెలంగాణ మొదటి వరుసలో ఉందన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే.. అన్ని వనరులను అందిస్తామని చెప్పారు.
కాగా.. ఒసాకా ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్రానికి చెందిన పలు ప్రముఖ పెట్టుబడులు, అవకాశాలు, పారిశ్రామికంగా రాష్ట్రంలో అనుకూలించే పరిస్థితులు, ఏయే కంపెనీలు ఈ ఏడాది ఒప్పందం చేసుకున్నాయి… వంటి సమగ్ర వివరాలను వెల్లడించారు. సో.. మొత్తానికి తెలంగాణ పేరు తొలిసారి ఒసాకా ఎక్స్‌పో వినిపించడమే కాదు.. చార్మినార్ తదితర సంస్కృతులతో కూడిన ప్రదర్శన కూడా కనిపించింది.