వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం.. వరుస పెట్టివైసీపీ కీలక నాయకులను పిలిచివిచారిస్తోంది. దీనిలో భాగంగా విజయసాయిరెడ్డిని విచారించిన మర్నాడే.. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని కూడా పిలిచి విజయవాడలో విచారించింది. అయితే.. ఈ విచారణ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించింది. అంతా సస్పెన్స్.. పైగా 8 గంటల సుదీర్ఘ విచారణ.(సాయిరెడ్డిని మూడు గంటలే విచారించారు). 100కు పైగా ప్రశ్నలు. దీంతో మిథున్‌రెడ్డిని ఏం ప్రశ్నించారు? ఏయే అంశాలపై కూపీ లాగారు..? అనే విషయాలు రాజకీయంగా ఆసక్తితో పాటు ఉత్కంఠ కూడా రేపాయి.
జగన్‌కు అత్యంత సన్నిహిత నాయకుల్లో మిథున్‌రెడ్డి కూడా ఒకరు. వరుస విజయాలు సాధించడమేకాదు..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు కూడాకావడం.. జగన్‌తో కలివిడిగా ఉంటూ.. అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం.. వంటివి ఈ విచారణకు మరింత దన్నుగా మారింది. సాయిరెడ్డిని విచారించిన మర్నాడే.. మిథున్‌రెడ్డిని ప్రశ్నించడంతో మరీ ఉత్కంఠ నెలకొంది. తాను మిథున్‌రెడ్డికి.. రూ.60 కోట్ల వరకు అప్పులు ఇప్పించానని సాయిరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు.. మిథున్‌రెడ్డి, కసిరెడ్డి రాజ్‌తో కలిసి మద్యం విధానంపై తాను కూడా చర్చించానని ఆయన సిట్‌కు వివరించారు.
ఈ పరిణామాలకు తోడు.. మద్యం విక్రయాలన్నీ వైసీపీకి చెందిన నేతల డిస్టలరీ నుంచే జరగడంతో ఈ విచారణకు ప్రాధాన్యం మరింత పెరిగింది. మొత్తంగా 8 గంటల పాటు విజయవాడలోని పోలీసు కమిషనర్ బంగ్లాలో జరిగిన విచారణలో మొత్తం 100కు పైగా ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. సాయిరెడ్డి చెప్పిన విషయాలను ప్రస్తావించినప్పుడు.. మిథున్‌రెడ్డి ఆ వ్యాఖ్యలను కొట్టేసినట్టు తెలిసింది. సాయిరెడ్డి నుంచి అప్పులు ఇప్పించి తీసుకునే పరిస్థితి తమకు లేదన్నారని సమాచారం. తామే ఆఫ్రికా.. ఇతర దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నామని.. మద్యం వ్యాపారంలో ఎప్పుడూతమ జోక్యం లేదని చెప్పినట్టు తెలిపారు.
ఇక, మిగిలి ఎక్కువ ప్రశ్నలకు మాత్రం తెలియదు, గుర్తులేదు.. అని సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా సాయిరెడ్డితో కలిసి భేటీ అయిన విషయంపై అనేక విషయాలు మాట్లాడుకుంటామని.. ఎప్పుడూ తరచుగా కలుసుకుంటూనే ఉంటామని చెప్పినట్టు తెలిసింది. అంతమాత్రాన మద్యం కోసమే మాట్లాడుకునేందుకు కలిసినట్టు భావించరాదని చెప్పినట్టు సమాచారం. కసిరెడ్డి రాజ్‌తో తనకు వ్యక్తిగత వ్యాపార సంబంధాలు ఏమీ లేవని వెల్లడించినట్టు తెలిసింది. ఇదిలావుంటే.. విచారణ ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత.. “నా బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ పరిధిలో ఉంది. ఇలాంటి సమయంలో మీడియాతో మాట్లాడరాదు“ అని చెప్పి మిథున్‌రెడ్డి వెళ్లిపోయారు.